RRR ఓవ‌ర్సీస్ రైట్స్ ఎంత‌కు?

Update: 2019-06-13 10:35 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించిన ప్ర‌తిదీ ఆస‌క్తిని పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై ప్ర‌స్తుతం కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ టీమ్ తో తొంద‌ర్లోనే రామ్ చ‌ర‌ణ్ జాయిన్ కానున్నార‌ని తెలుస్తోంది. స్వాతంత్య్రానికి ముందు అల్లూరి సీతారామ‌రాజు (చ‌ర‌ణ్‌) .. కొమ‌రం భీమ్ (ఎన్టీఆర్) అనే ఇద్ద‌రు వీరులు ఎలా ఉండేవారు? అస‌లు ఆ ఇద్ద‌రూ వీరులు కావ‌డానికి ముందు ఏం జ‌రిగింది? ఆ ఇద్ద‌రూ క‌లిసి ఆంగ్లేయుల‌పై పోరాడి ఉంటే ఏం జ‌రిగి ఉండేది? అన్న క‌థ‌కు చారిత్రక అంశాల‌ను మేళ‌వించి ఫిక్ష‌న్ పాత్ర‌ల‌తో చూపిస్తున్నామ‌ని రాజ‌మౌళి ఫ‌స్ట్ లుక్ లాంచ్ లో తెలిపారు. బాహుబ‌లి త‌ర్వాత విజ‌యేంద్ర ప్ర‌సాద్- రాజ‌మౌళి బృందం మ‌రో ఫిక్ష‌న్ క‌థ‌నే సినిమాగా తీస్తుండ‌డంతో ఆస‌క్తి పెరిగింది.

ఇక ఈ సినిమా కాస్టింగ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. హిందీ మార్కెట్ లో హైప్ కోసం బాహుబ‌లి జోడీ ప్ర‌భాస్ - అనుష్క ఈ చిత్రంలో న‌టింప‌జేస్తున్నార‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా ప‌లు చోట్ల భారీ మొత్తాల‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నా నిర్మాత దాన‌య్య ఆచి తూచి అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. అలాగే ఓవ‌ర్సీస్ బిజినెస్ ఇప్ప‌టికైతే స‌స్పెన్స్ లో ఉంది.

ఇటీవ‌లే దుబాయ్ కి చెందిన ఓ ప్ర‌ముఖ పంపిణీదారుడు 66 కోట్ల మేర‌ సింగిల్ పేమెంట్ ఆఫ‌ర్ చేశారని తెలుస్తోంది. చైనా త‌ప్ప ఇత‌ర దేశాల‌న్నిటా రైట్స్ కోసం ఇంత ఆఫ‌ర్ చేశారు. అయితే దాన‌య్య‌కు ఇది నాట్ ఓకే అని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ రైట్స్ కి 70 కోట్లు పైగా వ‌స్తుంద‌ని దాన‌య్య  ఆశిస్తున్నార‌ట‌. అయితే విదేశాల నుంచి అంత పెద్ద మొత్తాల్ని రిక‌వ‌రీ చేయాలంటే అంత సులువా? ఇది పెద్ద‌ రిస్క్ అనే వాద‌న ట్రేడ్ లో వినిపిస్తోంది.  మ‌రి దాన‌య్య ఈ విష‌యంలో త‌గ్గ‌రా? అన్న ముచ్చ‌టా సాగుతోంది. ఓవ‌ర్సీస్ బిజినెస్ ప‌రిశీలిస్తే.. నార్త్ అమెరికా వ‌సూళ్లు ఉన్నంత‌గా మిగ‌తా చోట్ల ఉండ‌డం లేదు. అమెరికా లో 3 మిలియ‌న్ డాల‌ర్లు (సుమార్ 20కోట్లు) వ‌సూలు చేయ‌డ‌మే గ‌గ‌నంగా మారింది. అలాంట‌ప్పుడు 70కోట్లు అంటే రిస్కే క‌దా? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని 30 జూలై 2020లో రిలీజ్  చేయ‌నున్నారు.

    

Tags:    

Similar News