సూపర్ స్టార్ కుక్క కూడా స్టారే

Update: 2018-03-09 05:51 GMT
అవును. పైన మీరు చదివింది అక్షరాల నిజం. సినిమా హీరోల మీద సౌత్ అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో అంతే ఇష్టం వాళ్ళు వాడే వస్తువులు, దుస్తులు, జంతువుల మీద కూడా అంతే చూపిస్తారు అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదమో. సూపర్ స్టార్ రజనికాంత్ హీరోగా రూపొందుతున్న కాలా సినిమాలో అందరిని ఆకర్షిస్తున్న అంశం తలైవా పక్కన అంటిపెట్టుకుని ఉన్న పెంపుడు కుక్క. గతంలో బాషా సినిమాలో ఇదే స్టైల్ మైంటైన్ చేసిన రజని అందులో కూడా ఇలాంటి కుక్కను హై లైట్ చేయటం ఫాన్స్ ఎవరు మర్చిపోలేదు. సహజంగానే ఈ కుక్క మీద కూడా ఆసక్తి, చర్చ మొదలయింది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు, ఎక్కడ దొరికింది లాంటి విషయాల గురించి ఆరా తీస్తే పలు ఆసక్తికరమైన సంగతులు బయటికి వచ్చాయి.

రజని పక్కన ఉన్న కుక్క పేరు మణి. సైమన్ అనే జంతువుల ట్రైనర్ దాన్ని వీధుల్లో తిరుగుతూ ఉండగా ఆ కుక్కలో చురుకుదనాన్ని గమనించి తన వద్దే ఉంచుకుని శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేసాడు. కాలా సినిమా కోసం కుక్క కావాలని దర్శకుడు పా రంజిత్ వెతుకుతున్నాడని తెలిసి సైమన్ మణిని అక్కడికి తీసుకెళ్ళాడు. సుమారు 30 కుక్కలతో పోటీ పడుతూ మణి చివరికి రంజిత్ మనసు గెలుచుకుని అందులో నటించేసింది. జస్ట్ ఏదో పక్కన తోక ఊపుకుంటూ కూర్చోవడం కాదట. చాలా కీలకమైన సన్నివేశాల్లో మణికి ప్రాధాన్యం ఉన్న సీన్స్ డిజైన్ చేసాడట రంజిత్. అదరహో అనేలా మణి దుమ్ము దులిపేసింది.

ఇప్పుడు షూటింగ్ పూర్తయ్యాక ఆ కుక్కకు డిమాండ్ పెరిగిపోయింది. రజనికాంత్ వీరాభిమానులు జంతు ప్రేమికులు ఎంత ఖరీదైనా మణిని కొనడానికి రెడీ అవుతున్నారు. ఏకంగా రెండు కోట్ల దాకా ఆఫర్ ఇవ్వడం చూసి సైమన్ కు మతి పోయింది. కాని తన కన్నబిడ్డలా పెంచిన మణిని ఎవరికి అమ్మే సమస్యే లేదని రేపు కాలా విడుదల అయ్యాక ఇది సూపర్ స్టార్ కుక్క అంటూ గర్వంగా వీధుల్లో తిప్పుతానని చెబుతున్నాడు సైమన్. అంతే మరి. సూపర్ స్టార్ చేతి రుమాలైనా, చెయ్యి తాకిన కుక్కైనా డిమాండ్ పీక్స్ లోనే ఉంటుంది.

Tags:    

Similar News