మెగాస్టార్‌ అన్న‌ది కొర‌టాల‌నేనా?

Update: 2022-09-01 06:50 GMT
స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మూవీ 'ఆచార్య‌'. ఈ మూవీ మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచి చిరు అభిమానుల‌కు భారీ షాక్ ఇచ్చింది. రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి చిరంజీవి న‌టించిన ఈ మూవీపై ఫ్యాన్స్ తో పాటు చాలా మంది భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ కూడా త‌న త‌న‌యుడితో క‌లిసి సినిమా చేయాల‌న్న‌ది త‌న భార్య సురేఖ కోరిక అంటూ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు.

ఖ‌చ్చితంగా ఇద్ద‌రం క‌లిసి చేయాల్సిందే అని 'RRR' షూటింగ్ కి అంత‌రాయం కల‌గ‌కుండా రాజ‌మౌళిని ఒప్పించి చ‌ర‌ణ్ డేట్స్ తీసుకున్నారు. కానీ అంత చేసినా 'ఆచార్య‌' మ‌ర్చిపోలేని తీపి గుర్తుగా మిగిలి పోతుందనుకుంటూ మ‌ర్చిపోలేని చేదు జ్ఞాప‌కంగా మిగిలింది. ఇదే ఇప్పుడు మెగాస్టార్ ని వేద‌న‌కు గురిచేస్తున్న‌ట్టుగా వుంద‌ని తెలుస్తోంది. సినిమా ఫ్లాప్ అయిన దగ్గ‌రి నుంచి చిరంజీవి ఏదో ఒక ఈవెంట్ కి వెళ్లినా ఇదే సినిమా ప్ర‌స్థావ‌న‌ని ఇండైరెక్ట్ గా తీసుకొస్తూ డైరెక్ట‌ర్ల‌పై సెటైర్లు వేస్తున్నారు.

గ‌తంలో ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ డైరెక్ట్ గానే డైరెక్ట‌ర్ల‌ల‌పై పంచ్ లు వేయ‌డం చ‌ర్చ‌నీయాంగా మారుతూ వ‌స్తోంది. కొంత మంది డైరెక్ట‌ర్లు సెట్ లోనే సీన్ లు రాస్తున్నార‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని కామెంట్ లు చేశారు.

ఈ ప‌ద్ద‌తిని చాలా మంది మార్చుకోవాల‌ని చుర‌క‌లు అంటించారు.  ఆయ‌న చేసిన కామెంట్ లు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ని ఉద్దేశించే అని అంద‌రికి స్ప‌ష్ట‌మైంది. 'ఆచార్య‌' డిజాస్ట‌ర్ ని జీర్ణించుకోలేక‌పోతున్న మెగాస్టార్ ఇలా కామెంట్ లు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

తాజాగా 'ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో' ప్రీ రిలీజ్ ఈ అవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి డైరెక్ట‌ర్ల‌ని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా వ‌చ్చిన హిట్ లు, ఫ్లాపుల గురించి ప్ర‌స్తావిస్తూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచిన బింబిసార‌, 'సీతారామం', కార్తికేయ 2' సినిమాలని గుర్తు చేశారు. ఈ సినిమా స‌క్సెస్ కి ప్ర‌ధాన కార‌ణం మంచి కంటెంట్‌. గుడ్ కంటెంట్ తో సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని, ఆస్వాదిస్తార‌ని ఈ సినిమాలు నిరూపించాయన్నారు.

అంతే కాకుండా ద‌ర్శ‌కులు కాంబినేష‌న్ లు, రిలీజ్ డేట్ ల‌పై కాకుండా క‌థ‌ల‌పై దృష్టి పెడితే మంచిద‌న్నారు. ప్రేక్ష‌కుల‌కు ఏది అవ‌స‌ర‌మో వాటిపైనే దృష్టి సారించాల‌ని, న‌టీన‌టుల డేట్స్ క్లాష్ అవుతున్నాయ‌ని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు. మెగాస్టార్ ఇంత‌లా ప్ర‌తీ ఈవెంట్ లోనూ ద‌ర్శ‌కుల‌నే పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం కొర‌టాల శివ చేసిన 'ఆచార్య‌' ప్రాజెక్ట్ అని, దాని ఫ‌లితం షాకిచ్చిన కార‌ణంగానే కొర‌టాల‌పై చిరు ఇలా ఇండైరెక్ట్ గా వ్యాఖ్య‌లు చేస్తున్నారా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వాపోతున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News