వెబ్ మీడియా రివ్యూల మీదనే NRIలు డిపెండ్ అవుతున్నారా..?

Update: 2022-10-20 12:30 GMT
సినీ ఇండస్ట్రీలో 'రివ్యూలు - రేటింగ్స్' మీద ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. సినిమా విడుదలైన తర్వాత.. అది ఎలా ఉందనే విషయం మీద సమీక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.. సినిమాలోని 24 క్రాఫ్ట్స్ పనితీరు గురించి ప్రస్తావిస్తూ తగిన రేటింగ్స్ ఇస్తుంటారు. భారతీయ సినిమాలోనే కాదు.. అంతర్జాతీయం ఏ భాషలో విడుదలైన చిత్రానికైనా రివ్యూలు ఇవ్వడం అనేది కామన్ గా చూస్తుంటాం.

వాస్తవానికి ప్రేక్షకులు ఎల్లప్పుడూ రివ్యూలు కావాలని కోరుకుంటుంటారు. కానీ ఇండస్ట్రీ జనాల్లో మాత్రం వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. రివ్యూల కారణంగా వసూళ్లపై ప్రభావం పడుతుందని.. సినిమా చచ్చిపోతుందని వాదించేవారు.. రివ్యూలను నియంత్రించాలని డిమాండ్ చేసేవారు ఉన్నారు. అదే సమయంలో సినిమాకు సమీక్షలు ఎంతో అవసరమని సమర్ధించేవారు కూడా ఉన్నారు.

అయితే ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా వారం రోజులకే కనుమరుగై పోతున్న నేపథ్యంలో 'రివ్యూలు' చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయనేది విశ్లేషకులు చెబుతున్నమాట. నిజానికి గత రెండు మూడేళ్ళలో ఆడియన్స్ చాలా చేంజ్ అయ్యారు. ఎలాంటి సినిమా చూడాలనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అందరూ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ట్రైలర్ - టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ చూసి సినిమాకు వెళ్లాలా వద్దా అని కొంతమంది డిసైడ్ అవుతున్నారు. ఫస్ట్ టాక్ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకునేవాళ్లు మరికొందరు ఉన్నారు. రివ్యూల కోసం వేచి చూసే ఓ వర్గం ప్రేక్షకులు కూడా ఉంటున్నారు. అందులో ముఖ్యంగా ఎన్నారైలు వెబ్ మీడియా రివ్యూల మీదనే డిపెండ్ అవుతున్నారనే చర్చలు జరుగుతున్నాయి.

ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా వెబ్ సమీక్షలు చూసి.. దానికి ఇచ్చే రేటింగ్స్ ని బట్టి NRIలు సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఓవర్ సీస్ లో పెద్ద హీరోల సినిమాలు కూడా ఓ మోస్తరు ప్రీమియర్ సేల్స్ సాధించకపోవడానికి ఇది ఒక కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వెబ్ మీడియాలో సమీక్షలు - రేటింగ్స్ బాగుంటేనే సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

నిజానికి పాండమిక్ తర్వాత ప్రేక్షకులు సినిమాల కోసం తమ సమయాన్ని డబ్బును ఆచితూచి వెచ్చిస్తున్నారు. ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో విరివిగా సరికొత్త కంటెంట్ చూడటానికి అవకాశం ఉన్న తరుణంలో.. రివ్యూలు జనాలను థియేటర్ల వరకూ నడిపించడానికి సహాయ పడుతున్నాయి. సినిమా బాగుంటే రివ్యూలు పాజిటివ్ మౌత్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి.. మరింత మంది ఆడియన్స్ ని ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నాయి.

కాకపోతే రివ్యూలు పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్య లేదు కానీ.. నెగెటివ్ రివ్యూలు వస్తే మాత్రం సమీక్షకులపై విమర్శలు చేయడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ఎవరూ కావాలని నెగటివ్ రివ్యూలు ఇవ్వరు. మంచి సినిమాలను ఎవరూ ఆపలేరనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. డిజిటల్ యుగంలో ఇప్పుడు దేనికైనా రివ్యూలు అనేవి చాలా కీలమని చెప్పాలి.

అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరో సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సినిమాలకు రివ్యూలు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఏదైనా సినిమా చూడాలనుకుంటే కచ్చితంగా రివ్యూలు చూసే డిసైడ్ అవుతానని తెలిపారు. సినిమా టాక్ లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏదేమైనా మంచి కంటెంట్ తో వస్తే.. రివ్యూలే ఆ సినిమాని ముందుకు తీసుకెళ్తాయని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News