ఆరేళ్ల వరకు ‘మా’ ఎన్నికలు జరిగే ఛాన్సు లేదా?

Update: 2021-07-07 04:30 GMT
తిప్పితిప్పికొడితే తొమ్మిది వందల మంది లేదంటే మరో వంద వేసుకుంటే.. ఎట్టి పరిస్థితుల్లో వెయ్యి దాటని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు జరగాల్సిన ఎన్నికల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సెప్టెంబరులో జరుగుతుందని భావిస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భిన్నంగా ఈసారి పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది.

దీనికి కారణం.. గుట్టుచప్పుడు కాకుండా ‘మా’ అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలేనని చెబుతున్నారు. ఈ మధ్యన  ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ నటుడు ప్రకాశ్ రాజ్ ‘మా’ అధ్యక్షుడికి ఏప్రిల్ లో లేఖ రాయటం.. ఆ లేఖకు జవాబు ఇస్తూ.. 2019లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం ఎన్నికల్ని సెప్టెంబరులో నిర్వహించే వీలుందన్న సమాధానాన్ని ఇచ్చారు. అనంతరం ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించి.. వేడి పుట్టించారు. దీంతో.. వడివడిగా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్రకాశ్ రాజ్ మాత్రమే కాదు తాము కూడా బరిలో నిలుస్తామంటూ మంచు విష్ణు.. జీవిత.. హేమ బరిలోకి దిగుతున్నట్లుగా ఒకరి తర్వాత మరొకరు ప్రకటనలు చేశారు. దీంతో.. ఒక్కసారి వాతావరణం వేడెక్కటమే కాదు.. అందరి చూపు ‘మా’ ఎన్నికల మీద పడ్డాయి. ప్రకాశ్ రాజ్ టీం ప్రెస్ మీట్ పెట్టి మరో నెల రోజుల పాటు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయొద్దని.. మీడియా ముందుకు రావొద్దని స్వీయ నిబంధన పెట్టుకున్నారు.  ఇదిలా ఉంటే.. అంతర్గతంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అదేమంటే.. 2019లో ఆమోదించిన తీర్మానం మీద.. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్ని వాయిదా వేసే హక్కు అధ్యక్షుడికి ఉందా? లేదా? అనే అంశంపై కార్యవర్గం పదవీకాలంపైన కొందరు సభ్యులు ‘మా’ కార్యవర్గానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో వారు లీగల్ ఓపీనియన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారం తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం ఒక కార్యవర్గం ఎన్నికైన తర్వాత గరిష్ఠంగా ఆరేళ్ల కాలం ఉండొచ్చని.. ‘మా’ బైలాస్ లో ఎక్కడా కూడా ఎన్నికైన కార్యవర్గం నిర్దిష్టంగా ఇంతకాలం ఉండాలని లేదన్న ‘లా’ పాయింట్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే.. గడిచిన 28 ఏళ్ల ‘మా’ సంప్రదాయం ప్రకారం ఒక కార్యవర్గం ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నిక వరకు కొనసాగుతుంది. కాబట్టి.. కొత్త కార్యవర్గం ఎన్నికై అధికారాలు చేపట్టే వరకు ప్రస్తుత కార్యవర్గం పూర్తి అధికారాలతో కొనసాగుతుంది’ అని లీగల్ అడ్వైజర్ తన అభిప్రాయాన్ని తెలిపినట్లుగా సమాచారం. అంటే.. ఒక ఎన్నికైన కార్యవర్గం ఆరేళ్ల వరకు కొనసాగొచ్చన్న అర్థం వచ్చేలా ‘మా’ లీగల్ అడ్వైజర్ తన అభిప్రాయాన్ని తెలిపినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రస్తుత ‘మా’ కార్యవర్గం.. కరోనా పరిస్థితుల్ని మొదట సాకుగా చూపించి వాయిదా వేసి.. తదనంతరం ఇలా ఏదో ఒక కారణాలతో కొన్నేళ్లు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే.. న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఆరేళ్ల వరకు వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట ‘మా’కు చెందిన కొందరు కీలక వ్యక్తుల నోటి నుంచి ప్రైవేటు సంభాషణలో రావటం గమనార్హం. ఇప్పటికే ఎన్నికల పేరుతో వేడెక్కిపోయిన పరిస్థితుల్లో.. ప్రస్తుత కార్యవర్గం తెలివైన ఆటకు తెర తీసే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News