షాకింగ్‌: న‌టి రాశి ఇంటిపై ఐటి సోదాలు

Update: 2019-10-31 09:39 GMT
న‌టి రాశి ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయా? అంటే అవున‌నే స‌మాచారం. న‌టి రాశి ఇంటిపైనా.. ఆమె సోద‌రుడు `క‌ల‌ర్స్` సంస్థ అధినేత అయిన విజ‌య్ కృష్ణ ఇల్లు-కార్యాల‌యాల‌ పైనా ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ క‌ల‌ర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్ర‌.లి కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ కంపెనీ  కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న మొత్తం 40 లొకేష‌న్ల‌లో ఈ సోదాలు నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్ర‌దేశ్ స‌హా దేశంలోని ప‌లు మెట్రో న‌గ‌రాల్లో ఉన్న క‌ల‌ర్స్ ఆఫీసుల్లో సోదాలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

ఆర్థిక వ్య‌వ‌హారాలు ప‌న్ను చెల్లింపుల్లో తేడా వ‌చ్చింద‌న్న‌ది ఐటీ అధికారుల వివ‌ర‌ణ‌. క‌ల‌ర్స్ కంపెనీకి సంబంధించిన‌ డాక్యుమెంట్ల‌ను.. ర‌క‌ర‌కాల బిల్లుల్ని ఐటీ అధికారులు ప్ర‌స్తుతం ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. బ్యూటీ.. ఫిట్ నెస్.. వెయిట్ లాస్ త‌దిత‌ర రంగాల్లో క‌ల‌ర్స్ సంస్థ సేవ‌లందిస్తోంది. న‌టి రాశీ సోద‌రుడు విజ‌య్ కృష్ణ దేవుల ఈ కంపెనీని నిర్వ‌హిస్తున్నారు. విజ‌య్ కృష్ణ ఆయ‌న‌తో పాటు భాగ‌స్వామిగా ఉన్న రాయుడుపైనా.. అలాగే రాశీ ఇంటిపైనా ఐటీ దాడులు నిర్వ‌హించార‌ని తెలుస్తోంది.

అయితే ఆదాయం విష‌యంలో తప్పుడు లెక్క‌లు చెప్ప‌డంతోనే ఈ సోదాలు నిర్వ‌హించామ‌ని ఓ ఐటీ అధికారి వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ కంపెనీ మెషిన‌రీతో పాటుగా డాక్యుమెంట్ల‌ను సీజ్ చేశామ‌ని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు మెట్రో న‌గ‌రాల్లో క‌ల‌ర్స్ కు సంబంధించిన‌ 49 బ్రాంచీలు.. 1500 మంది డైటీషియ‌న్లు- థెర‌పిస్టులు ఇందులో ప‌ని చేస్తున్నారు. 10ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. అయితే ఈ కంపెనీపై విశాఖ‌ప‌ట్నం- విజ‌య‌వాడ వంటి చోట్ల ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం కోర్టుల ప‌రిధికి వెళ్ల‌డం అటుపై కంపెనీకి వ్య‌తిరేకంగా జ‌డ్జిమెంట్ రావ‌డం తెలిసిన‌దే. రాశీ- రంభ వంటి తార‌లతో చేసిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు త‌ప్పు దారి ప‌ట్టిస్తున్నాయ‌ని విజ‌య‌వాడ‌కు చెందిన ఓ క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదు చేయ‌డంతో అది అప్ప‌ట్లోనే సంచ‌ల‌న‌మైంది. ఈ ఆరోప‌ణ‌ల‌తో రాశీ-రంభ వంటి వారి ప్ర‌క‌ట‌న‌ల్ని నిలిపివేయాల్సిందిగా కోర్టు తీర్పును వెలువ‌రించింది.


Tags:    

Similar News