ఐటెం గర్ల్స్ కనిపించుట లేదు

Update: 2018-06-13 14:30 GMT
మనం తినే భోజనం సంపూర్ణంగా అనిపించాలంటే అన్నం-పప్పు ఉన్నంత మాత్రాన సరిపోదు. అదనంగా నంజుకోవడానికి ఆవకాయ ఉండాల్సిందే. చివరిలో పెరుగు పడాల్సిందే. అప్పుడుగాని ఆకలి రాముడు సంతృప్తి చెందడు. సినిమా కూడా అంతే. మసాలా దినుసులు అన్ని కరెక్ట్ గా దట్టిస్తేనే మాస్ ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తారు. అందులో ఐటెం సాంగ్ చాలా కీలకమైనది . ఇది స్వర్గీయ ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు సినిమాలో గుగ్గు గుడిసుంది మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశలో స్వింగ్ జరా దాకా కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్ తరం మారే కొద్దీ ఆగిపోయేది కాదు. మాస్ ప్రేక్షకుడిని ఓ ఐదు నిమిషాల పాటు ఉర్రూతలూగించే ఐటెం సాంగ్స్ ఈ మధ్య పెద్దగా కనిపించకపోవడం రసిక ప్రియులను కలవరపరుస్తోంది. పోకిరిలో ఇప్పటికింకా నావయసు పాట ముమైత్ ఖాన్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. సిల్క్ స్మిత డిస్కో శాంతి లాంటి వాళ్లకు పేరు వచ్చింది వీటి వల్లే. కానీ అదే పనిగా సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెడుతున్న నిర్మాతల సంఖ్య రాను రాను బాగా తగ్గిపోవడం గమనించాల్సిన అంశం. ఫిలిం మేకర్స్ దృక్పధంలో మార్పు రావడమే దీనికి కారణంగా కూడా చెప్పొచ్చు.

జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ థియేటర్లు ఊగిపోయే మాస్ ఐటెం సాంగ్ పెట్టించిన దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను వచ్చేటప్పటికి దాని ఊసే లేకుండా మూడు గంటల సినిమాతో హిట్ కొట్టేశాడు . మహేష్ సైతం స్పైడర్-బ్రహ్మోత్సవంలో కూడా వీటికి దూరంగానే ఉన్నాడు. హీరో ఎవరైనా ఒక ఐటెం సాంగ్ ఉండాలి అనే ట్రెండ్ మెల్లగా మారుతోంది. ప్రత్యేకంగా వీటి కోసం ఐటెం గర్ల్స్ ఉండటం లేదు. హీరోయిన్లే తాము లేని వేరే సినిమాల్లో సాంగ్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. రంగస్థలంలో పూజా హెగ్డే జైలవకుశలో తమన్నా ఆగడులో శృతి హాసన్ వీళ్లంతా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్స్. అప్పట్లో జయమాలిని-జ్యోతిలక్ష్మి-సిల్క్ స్మితా లాగా సెపెరేట్ బ్యాచ్ కాదు. రెమ్యునెరేషన్ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు రిస్క్ తక్కువగా ఉండటంతో వేరేవాళ్లు ఎందుకని ఐటెం సాంగ్స్ కూడా వీళ్ళే చేస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా టాలీవుడ్ లో ఐటెం గర్ల్స్ లేకుండా పోయారు. దానికి తోడు అన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెట్టే సంస్కృతి తగ్గిందనే చెప్పాలి. కానీ మాస్ ప్రేక్షకుడికి ఐటెం సాంగ్ ఆయువు పట్టు లాంటిది. అది లేకపోతే చాలా వెలితిగా ఫీలవుతాడు. మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నా అది వాడికి అనవసరం. మసాలా పాటతో కిక్ రావాల్సిందే అంటాడు. సో వాళ్ళను పోగొట్టుకొకూడదు అంటే మళ్ళి ఐటెం సాంగ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టక తప్పదు.


Tags:    

Similar News