ఎగ్జిబిషన్ రంగం ప్రక్షాళనకు సమయం వచ్చిందా?

Update: 2020-05-04 01:30 GMT
ఇప్పుడు సినిమా థియేటర్లకు గడ్డుకాలం వచ్చింది. ఓటీటీలు మెల్లగా జనాలను మాయ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ థియేటర్ల వ్యవస్థకు పునర్వైభవం రావాలంటే అందులో ఉన్న కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకోవాలని..  పరిశ్రమకు.. నిర్మాతలకు నష్టం జరిగేలా ఉన్న కొన్ని పాత పద్ధతులను ప్రక్షాళన చెయ్యాలని ఈ రంగంలో ఉండే సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

వారు చేసే సూచనలలో కొన్నిటిని పరిశీలిద్దాం.  హాలీవుడ్ బాలీవుడ్ మాదిరిగా మన తెలుగు సినీ పరిశ్రమ కూడా అటు ఓటీటీలను.. ఇటు థియేటర్లను సమన్వయపరుచుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. దీనికి టికెట్ల విక్రయంలో పారదర్శకత తీసుకురావాలి.  అంటే తప్పనిసరిగా థియేటర్లో తెగే ప్రతి టికెట్టు ఆన్ లైన్లో కనిపించాలి. అప్పుడే అసలు కలెక్షన్స్ ఎంత వస్తున్నాయనే విషయంలో స్పష్టత వచ్చేది.  కలెక్షన్ల కాకి లెక్కలకు చెక్ పడేది. ఎప్పటి నుంచో కొందరు ఎగ్జిబిటర్లు సినిమాలకు కలెక్షన్లు తక్కువ చూపించి కోట్లు వెనకేసుకుంటున్నారని.. లెక్కల్లో తప్పులు చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  హీరోలు ఎక్కువ చేసి చూపించుకునే కాకిలెక్కల భాగోతం వేరే సబ్జెక్ట్.. అది ఇక్కడ అప్రస్తుతం.

థియేటర్ల కలెక్షన్స్ లెక్కలు సరిగా ఉంటేనే నిర్మాతలకు నష్టాలు తగ్గుతాయని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. రెండోది సింగిల్ స్క్రీన్ ప్లేసులో మల్టి స్క్రీన్స్ వస్తేనే పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు.  సినిమాను ఆస్వాదించేవాడు ఎలాగూ..ఎంత రేటు పెట్టి అయినా థియేటర్ కు వస్తాడని.. ఆ విషయంలో ఆందోళన అవసరం లేదని అంటున్నారు.  

దాదాపు 40 ఏళ్ల నుంచి ఓ ప‌ది మందే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూష‌న్ ని శాసిస్తున్నారనేది అందరూ చెప్పే విషయం.  పెద్ద సినిమాలు అన్నీ వీళ్లే డిస్ట్రీబ్యూట్ చేస్తారని.. కొత్త సినిమాలు లేదా చిన్న సినిమాలు మాత్రమే కొత్త వాళ్ల‌కి పంపిణీ చేసే అవ‌కాశం ఉంటుందని ఎప్పటి నుంచో విమర్శలు  ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఆ న‌లుగురినే అంతా టార్గెట్ చేసిన‌ప్ప‌టికి జిల్లాల్లో ఏనాటి నుంచో పాతుకుపోయిన వారిని క‌ద‌ల్చ‌డం చాలా క‌ష్టం. నిజానికి వీరితోనే సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు.  వీరిలో కూడా మార్పు వస్తేనే థియేటర్ల వ్యవస్థ బాగుపడుతుందని అంటున్నారు.

    

Tags:    

Similar News