జగపతిబాబు డైలాగ్ చెప్పలేకపోయాడా?

Update: 2017-08-01 08:59 GMT
నటుడిగా జగపతిబాబు అనుభవమెంతో.. ఆయన సామర్థ్యమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డైలాగ్ చెప్పడంలోనూ జగపతిబాబు శైలే వేరు. ఐతే అలాంటి నటుడితో ఒక డైలాగ్ చెప్పించడానికి నాలుగు రోజుల పాటు 20 టేక్స్ తీసుకున్నాడట బోయపాటి శ్రీను. ‘జయ జానకి నాయక’ సినిమా కోసం తనను డబ్బింగ్ విషయంలో చాలా హింస పెట్టేశాడంటూ బోయపాటిపై కంప్లైంట్ చేశాడు జగపతి. ఈ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ జగపతి ఈ విషయం వెల్లడించాడు. తన కెరీర్లో ఏ సినిమా డబ్బింగ్ కోసం తాను ఇంత కష్టపడలేదని చెప్పిన జగపతి.. బోయపాటి తన వెనుకే ఉండి కొన్ని రోజుల పాటు డబ్బింగ్ చెప్పించినట్లు తెలిపాడు. ప్రతి సన్నివేశానికి సంబంధించి ఏ మాట ఎలా పలకాలి.. ఎలాంటి మాడ్యులేషన్లో చెప్పాలన్నది వివరించినట్లు వెల్లడించాడు.

ఒక దశలో ఇక ఊపిరి ఎలా పీల్చాలి వదలాలి అన్నది కూడా చెబుతాడేమో అని భయపడి త్వరగా డబ్బింగ్ ముగించి బయటపడిపోయినట్లు జగపతి చెప్పడం విశేషం. ఐతే ఒక డైలాగ్ విషయంలో మాత్రం ఎంతకీ బోయపాటిని సంతృప్తిపరచలేకపోయానని.. నాలుగు రోజుల పాటు 20 టేక్స్ తీసుకున్నానని చెప్పాడు జగపతి. ఎలాగోలా ఆ డైలాగ్ ను మేనేజ్ చేసేశాడని.. ఆ డైలాగ్ ఏంటన్నది తాను సక్సెస్ మీట్లో చెబుతానని మాట దాటవేసేశాడు జగపతిబాబు. ఇక ‘జయ జానకి నాయక’ షూటింగ్ సందర్భంగా తనతో పాటు పేరున్న నటీనటులందరినీ నిలబెట్టి హెడ్ మాస్టర్ తరహాలో ఆ రోజు తీయబోయే సన్నివేశాల గురించి బ్రీఫింగ్ ఇచ్చేవాడని.. అతడి మీద గౌరవంతో.. సినిమా మీద అతడికి ఉన్న శ్రద్ధ ఏంటో అర్థం చేసుకుని తామందరం సహకరించామని జగపతి తెలిపాడు.
Tags:    

Similar News