సీక్వెల్స్ కోసం కంటెంట్ దాచేసిన కామెరూన్

Update: 2022-12-22 02:30 GMT
జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన `అవ‌తార్` సృష్ఠించినంత సంచ‌ల‌నం సీక్వెల్ తో సాధ్యం కాలేద‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. కోవిడ్ 19 ప‌ర్య‌వ‌సానం ఈ సినిమాపై తీవ్ర‌ ప్ర‌భావం చూపింద‌ని .. ఈ మూవీ రిలీజ్ స‌మ‌యంలో చైనా- అమెరికా లాటి చోట్ల క‌రోనా తిరిగి విజృంభిస్తుండ‌డం వంటి కార‌ణాలు వ‌సూళ్ల‌లో బిగ్ డ్రాప్ కి కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. అవతార్ 2 మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్ల డాల‌ర్ల కలెక్షన్లను నమోదు చేయగా.. తొలి వారంలోనే వ‌సూళ్ల‌లో డ్రాప్స్ క‌నిపించ‌డం నిరాశ‌ప‌రుస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.

అవ‌తార్ 2 అద్భుత సాంకేతిక‌త‌తో తెర‌కెక్కిన డాక్యు సినిమా అంటూ ఇప్ప‌టికే కొంద‌రు విమ‌ర్శించారు. కానీ జేమ్స్ కామెరూన్ మార్క్ విజువ‌ల్స్ క‌ట్టి ప‌డేస్తాయని ప్ర‌శంసించారు. అవ‌తార్ 2 ద్వితీయార్థం నిజంగానే ఒక విజువ‌ల్ ఫీస్ట్ అన్న  ప్రశంస‌లు ద‌క్కాయంటే జేమ్స్ కామెరూన్  ని ఈ సీక్వెల్ ని ఎవ‌రూ త‌క్కువ అంచ‌నా వేయ‌లేదు.

ఇక అవ‌తార్ 2 కి కొన్ని మైన‌స్ లు ఉన్నాయ‌ని కూడా ఒక సెక్షన్ మీడియా విశ్లేషిస్తోంది. అవ‌తార్ 2 ని డాల్బీ అట్మాస్ లో వీక్షిస్తే ఆ అనుభూతి వేరు.  కానీ 2015లో `అవతార్` స్వరకర్త గ్రేట్ ట్యాలెంట్ జేమ్స్ హార్నర్ మరణంతో ఈ మూవీకి ప‌లువురు ఇత‌ర సంగీత ద‌ర్శ‌కులు ప‌ని చేసారు. ఇది సినిమాకి మైన‌స్ గా మారింది.

ఇక అవ‌తార్ 2లో ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అని విశ్లేషిస్తే..

అద్భుతమైన విజువల్స్ తప్ప అవతార్ 2 క‌థాంశంలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేక‌పోవ‌డం నిరాశను కలిగిస్తుంది. మొదటి భాగంలో ఆకాశ విహంగాల్లాంటి ప‌క్షుల‌ను మచ్చిక చేసుకోవడం లేదా జేక్ సుల్లీ టోరుక్ మచ్టోగా మారడం మూవీలో షాకింగ్ ట్విస్ట్. కానీ అవతార్ 2లో అలాంటి ట్విస్టులేవీ లేవు. తులువాన్ వేల్ కుటుంబం నుండి బహిష్కరించబడిన పయకన్ అనే ఒకే రెక్క ఉన్న పెద్ద తిమింగలంతో జేక్ చిన్న కొడుకు కలిసిపోవడం అనే ట్విస్టు చూడ‌గానే.. అతను దానిని మచ్చిక చేసుకుంటాడని .. చివరికి అది సముద్ర ప్రజలను అడవిని కాపాడుతుందని అంతా అర్థం చేసుకుంటారు.

ఇక అవ‌తార్1 కి విల‌న్ కూడా ప్ర‌ధాన బ‌లం. మొదటి భాగంలో కల్నల్ మైల్స్ క్వారిచ్ గా స్టీఫన్ లాంగ్ తన క‌ర్క‌శ‌మైన‌ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచి ఈసారి `అవతార్ 2`లో కొత్త రూపంతో తిరిగి వ‌చ్చాడు. అయితే మొదటి భాగంలో అత‌డి విల‌నీ అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. ఆ పాత్ర‌లో చాలా నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే మ‌రో లెవ‌ల్లో ఉంటుంది.  కానీ ఇక్కడ అవతార్ 2లో లాంగ్ పాత్ర రొటీన్ గా ఉంటుంది. త‌ర్వాతి స‌న్నివేశాలేమిన్నది ఈజీగా ఊహించేయ‌వ‌చ్చు. నిజానికి ఎవ‌రు ఎన్ని స‌మీక్ష‌లు చేసినా కానీ మాస్ట‌ర్ ఇన్ ఫిలింక్రాఫ్ట్ జేమ్స్ కామెరూన్ త‌న‌కు తెలియ‌కుండానే ఇవ‌న్నీ చేసాడా? అంటే అలాంటిదేమీ లేదు. అత‌డు అవ‌తార్ ని ఐదు సీక్వెళ్లుగా తెర‌కెక్కించాలంటే కీల‌క‌మైన ఘ‌ట్టాల‌ను దాచాల్సి ఉంటుంది. పార్ట్ 3 .. పార్ట్ 4 .. పార్ట్‌ 5 గురించి ఇంత‌కుముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News