పెళ్లి ఎక్కడో చెప్పేసిన శ్రీదేవి కుమార్తె

Update: 2019-09-09 14:30 GMT
జాన్వీ కపూర్ అనే కన్నా.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అన్నంతనే గుర్తుకు వచ్చేస్తుంది తెలుగోళ్లకు.  యూత్ కు ఫర్లేదు కానీ.. యూత్ దాటేసినోళ్లకు మాత్రం శ్రీదేవి కూతురిగానే రిజిస్టర్ అయ్యింది జాన్వీ. తన ధడక్ చిత్రంలో మంచి పేరును సొంతం చేసుకున్నఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
అయితే.. సినిమాల కబుర్లు కాకుండా.. రోటీన్ కు భిన్నంగా పెళ్లికి సంబంధించి డీటైల్డ్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేనప్పటికీ.. పెళ్లి ఎక్కడ చేసుకోవాలి?  పెళ్లి మెనూలో ఏం ఉండాలనే అంశాల మీద మాత్రం ఫుల్ క్లారిటీ ఉన్నట్లుగా ఆమె మాటల్ని విన్నంతనే అర్థమవుతుంది.

మీ పెళ్లి గురించి మీ అమ్మ శ్రీదేవి ఉన్నప్పుడు చర్చించేవారా? అని ప్రశ్నించగా.. తన పెళ్లి విషయమై తాము చాలాసార్లు మాట్లాడుకున్నామని జాన్వీ చెప్పింది. తన తల్లికి తన మీద నమ్మకం తక్కువని.. నేను త్వరగా ప్రేమలో పడిపోతానని తన అభిప్రాయమని పేర్కొంది.

తన జడ్జిమెంట్ మీద తల్లికి నమ్మకం లేకపోవటంతో తానే ఒక అబ్బాయిని చూస్తానని చెప్పినట్లు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరంగా చెప్పింది. అందరి మాదిరే తానంటే తనను పెళ్లాడే వ్యక్తికి చచ్చేంత ఇష్టం ఉండాలన్న మాటల్ని చెప్పిన ఆమె.. కొన్ని ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చింది. తాను చేసే పని పట్ల శ్రద్ధ.. నిబద్ధత ఉండాలని చెప్పింది.

అతని నుంచి తాను కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలని.. సెన్సాఫ్ హ్యుమర్ ఉండాలంటూ పెద్ద లిస్ట్ నే చెప్పింది. మరి.. పెళ్లి ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి ఎంత గ్రాండ్ గా జరగాలని కోరుకుంటున్నారన్నప్పుడు.. మిగిలిన సెలబ్రిటీలకు భిన్నంగా జాన్వీ మాటలు ఉండటం విశేషం.

తాను రిచ్ గా.. అట్టహాసంగా.. భారీ వేడుకులకు తాను చాలా దూరమని స్పష్టం చేసింది. తన పెళ్లి చాలా సాంప్రదాయబద్ధంగా జరగాలని తాను కోరుకుంటానని పేర్కొంది. ప్రముఖుల ఇళ్లల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగులకు భిన్నంగా.. తన పెళ్లి సంప్రదాయబద్ధంగా తిరుమలలో చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది.

పెళ్లిలో తాను కాంచీపురం పట్టుచీరను కట్టుకుంటానని.. పెళ్లి తర్వాత తనకెంతో ఇష్టమైన సౌతిండియా వంటకాలతో బ్రహ్మాండమైన విందు ఉంటుందని ఊరించింది. ఆ విందు మెనూలో ఇడ్లీ.. సాంబార్.. పెరుగన్నం.. పాయసం లాంటివి చాలానే ఉంటాయని చెప్పింది. ఈ కబుర్లన్ని విన్నాక.. జాన్వీని అసలుసిసలు తెలుగమ్మాయిగా లెక్కలోకి వేసుకోవటం కరెక్ట్ అనిపించట్లేదు?  


Tags:    

Similar News