వరుడు ఎవరో డిసైడ్ కాలేదు కానీ.. పెళ్లి ఎలా జరగాలో చెప్పేసింది

Update: 2021-08-03 04:38 GMT
జాన్వీ కపూర్ పేరు చెప్పినంతనే అందరికి గుర్తుకు వచ్చేది వాళ్ల అమ్మ శ్రీదేవినే. తన ముద్దుల కుమార్తెను స్టార్ హీరోయిన్ గా చూడాలన్న ఆమె ఆశ తీరకుండానే అర్థాంతరంగా వెళ్లిపోవటం తెలిసిందే. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ పెళ్లీడుకు రావటం.. ఆమె పెళ్లి పైన తరచూ వార్తలు వస్తుంటాయి. ఇలాంటి వేళ.. ఒక మీడియా సంస్థ ఆమెను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఇందులో పెళ్లి  ఎక్కడ.. ఎలా జరిగితే బాగుంటుందన్న విషయంపై క్లియర్ గా చెప్పేసింది.

పెళ్లికొడుకు ఎవరో డిసైడ్ కానప్పటికి తన పెళ్లి విషయంలో జాన్వీ కపూర్ కు ఉన్న క్లారిటీ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంతలా తన పెళ్లి ముచ్చట్లుచెప్పేసిన ఈ ముద్దుగుమ్మ మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఆమె మాటల్ని విన్న తర్వాత.. ఇంతకీ కలల రాకుమారుడు ఎక్కడ ఉన్నాడు జాన్వీ అని అడగాలనిపించటం ఖాయం. పెళ్లికి ముందు చేసుకునే బ్యాచిలరెట్ పార్టీ  ని దక్షిణ  ఇటలీలోని కాప్రీలో బోట్ లో చేసుకుంటానని చెప్పింది. ఇక.. సంగీత్.. మెహందీ వేడుకలకు మాత్రం తన తల్లి శ్రీదేవి ఇల్లు అయిన మైలాపూర్ లోని ఇంట్లో చేసుకుంటామని చెప్పింది.

పెళ్లిని మాత్రం తిరుపతిలో చేసుకుంటానని.. సంప్రదాయబద్ధంగా ప్లాన్ చేస్తానని వెల్లడించింది. చీర.. మెహందీ.. సంగీత్ లకు ఎల్లో.. పింక్.. గోల్డ్ కలర్స్ ను ఎంచుకుంటానని చెప్పిన ఆమె నగలు మాత్రం డైమండ్స్ తో చేసినవే ధరిస్తానంది. పెళ్లి వేడుకల్ని రెండు రోజులే జరుపుతానన్న జాన్వీ.. రిసెప్షన్ గురించి అడిగితే మాత్రం.. ‘అవసరమా?’ అంటూ ఎదురు ప్రశ్న వేయటం గమనార్హం. పెళ్లి మండపం ఎలా ఉంటాన్న దానిపై పెద్ద ఐడియా లేదంది.

కాకుంటే.. సంప్రదాయబద్ధంగా పెళ్లి మండపం ఉండాలని.. పెళ్లి స్టేజ్ మాత్రం మల్లెపువ్వులు.. కొవ్వొత్తులతో సిద్ధం చేస్తే బాగుంటుందంటూ అదిరే ప్లాన్ ను వెల్లడించింది. తోడు పెళ్లికూతుళ్లుగా తన చెల్లెలు ఖుషీతో పాటు.. అన్షులా పేరు చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ అన్షులా ఎవరో కాదు.. ఆమె తండ్రి బోనీకపూర్ మొదటి భార్య కుమార్తె. తన స్నేహితురాలు తనీషా సంతోషి పేరు కూడా చెప్పింది. తన తండ్రి భావోద్వేగానికి గురైతే ఆయన్ను ఎలా సముదాయించాలో తన అక్కడ అన్షులాకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదంది. పెళ్లి కొడుకు ఎవరో తేలకుండానే పెళ్లి ఎలా చేసుకోవాలన్న దానిపై జాన్వీకున్న క్లారిటీ మాత్రం చాలా తక్కువమందికి ఉంటుందని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News