జయలలిత-శోభన్ బాబు.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Update: 2016-12-06 06:43 GMT
జయలలితను గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకురాలిగానే చూస్తున్నాం. కానీ అంతకుముందు ఆమె స్టార్ హీరోయిన్. తమిళం.. తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా.. అత్యధిక పారితోషకం అందుకున్న నటిగా వెలుగొందింది. ఆ సమయంలో ఆంధ్రా అందగాడు శోభన్ బాబుతో ఆమె బంధం కూడా చాలా ప్రత్యేకమైందే. వీళ్లిద్దరూ ఓ దశలో ఎంత దగ్గరయ్యారో అందరికీ తెలుసు.  ఐతే వీళ్ల మధ్య అంత గాఢ బంధం మొదలవడానికి ముందు కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి.

లక్షలాదిమంది అమ్మాయిలకు నిద్ర లేని రాత్రుల్ని మిగిల్చిన శోభన్ బాబుకు.. జయలలిత నిద్ర లేకుండా చేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. శోభన్ బాబు హీరోగా ఓ స్థాయికి ఎదగడానికి ముందే జయలలిత స్టార్ హీరోయిన్ అయింది. ఆమెతో  నటించాలని శోభన్ బాబు ఎంతో తపించాడు. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడట సోగ్గాడు. జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో.... అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓసినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి వెయ్యి రూపాయల అడ్వాన్స్ ఇచ్చి.. తన పక్కన జయలలితను కథానాయికగా పెట్టి సినిమా తీయబోతున్నట్లు కూడా చెప్పాడట. దీంతో శోభన్ బాబు మహదానంద పడిపయాడట. ఐతే హీరోగా శోభన్ బాబు అంత రేంజ్ లేదని జయ తల్లి సంధ్య ఆ సినిమా చేయడానికి నిరాకరించారట.

ఐతే ఎట్టకేలకు చాలా ఏళ్ల తర్వాత ‘డాక్టర్ బాబు’ సినిమాలో జయలలితతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నాడు శోభన్ బాబు. అప్పటికే కథానాయకుడిగా శోభన్ బాబు మంచి స్థాయికి చేరడంతో జయకు కూడా ఆ సినిమా చేయడానికి అభ్యంతరం లేకపోయింది. 1973లో ఈ సినిమా షూటింగ్ లో ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

‘‘జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. అప్పటికి నేను ఆమెను చూడలేదు. ఆమెను చూడాలని తపించాను. తపించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించని వారికి కూడా చెప్పుకున్నాను. ఆమెతో సినిమా అని చెప్పిన నిర్మాత కనిపించకుండా పోయేసరికి నిరాశ చెందాను. ఐతే ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత జయతో సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అంటూ ఓ సందర్భంలో శోభన్ బాబు చెప్పడం విశేషం.

అప్పటికే తన తల్లి మరణించడంతో ఒంటరితనం అనుభవిస్తున్న జయ..శోభన్ బాబుకు బాగా దగ్గరయ్యారట. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నానని.. మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోందని జయలలిత తనతో స్వయంగా చెప్పినట్లు ఓ సందర్భంలో శోభన్ బాబు చెప్పడం విశేషం.  తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ.. ఎంజీఆర్ కు దగ్గరై శోభన్ బాబుకు పూర్తిగా దూరమైందని అంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News