నందుల‌న్నీ హంబ‌క్ అన్న ప్ర‌ముఖ నటుడు

Update: 2017-11-27 10:49 GMT
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. నంది అవార్డుల ప్ర‌క‌ట‌న అనంత‌రం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌గా రెండు వ‌ర్గాలుగా.. అడ్డంగా చీలిపోయింద‌న్న వాద‌న వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. నందుల ప్ర‌క‌ట‌న మీద ఎంత వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసిన వారు ఉన్నారో.. అనుకూలంగా వాదించే వారూ ఉన్నారు. నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై చాలామంది చాలా వ్యాఖ్య‌లు చేసినా.. కొన్ని వ్యాఖ్య‌లు రేపే ర‌చ్చ అంతా ఇంతా కాదు.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అన్న‌ట్లు నిలిచే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌.. నంది అవార్డుల‌పై త‌న‌దైన శైలిలో రియాక్ట్ కావ‌టం.. దానిపై కొంద‌రు రియాక్ట్ కావ‌టం తెలిసింది. తాజాగా.. వ‌ర్మ బాట‌లోనే న‌డిచారు ఆయ‌న శిష్యుడిగా చెప్పే ప్ర‌ముఖ నటుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి.

విష‌యం ఏదైనా త‌న‌ను ప్ర‌శ్న‌ను అడ‌గ‌ట‌మే ఆల‌స్యం.. ముఖం ప‌గిలిపోయేలా జ‌వాబులు ఇవ్వ‌టం జేడీకి అల‌వాటు. అందుకే ఆయ‌న‌తో లైవ్ ఇంట‌ర్వ్యూ అంటే ప‌లు మీడియా సంస్థ‌లు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని చెబుతారు. ఆయ‌న్ను లైవ్ ఇంట‌ర్వ్యూ చేసేట‌ప్పుడు గిల్లి.. గిచ్చే ప్ర‌శ్న‌లు అడ‌గొద్దంటూ ముందే చెప్పేస్తార‌న్న మాట మీడియా మిత్రులు చెబుతుంటారు. ఎందుకంటే.. జేడీని గిల్లితే నొప్పి జేడీ కంటే గిల్లిన మీడియాకే ఎక్కువ‌ని చెబుతుంటారు.

తాజాగా నంది అవార్డుల మీద సాగుతున్న ర‌చ్చ మీద జేడీ రియాక్ట్ అయ్యారు. 1989 నుంచి 2017 వ‌రకు ప్ర‌క‌టించిన నంది అవార్డులు ఉత్త హంబ‌క్‌.. నాన్ సెన్స్ అంటూ తేల్చేశారు.

గ‌డిచిన కొన్నేళ్లుగా త‌మిళ‌.. మ‌ల‌యాళ చిత్రాల్ని తీస్తున్న జేడీ.. తాజాగా తెలుగు సినిమాలు తీస్తున్నారు. అవ‌న్నీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల నంది అవార్డుల ప్ర‌క‌ట‌న మీద చోటు చేసుకున్న వివాదంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌న్నీ కూడా అబ‌ద్ధాలేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎందుకిలా వ్యాఖ్యానిస్తున్నారంటే.. తాను స్వార్థ‌ప‌రుడిన‌ని.. త‌న‌కు అవార్డులు రాలేదు కాబ‌ట్టి ప్ర‌క‌టించిన అవార్డుల‌న్నీ అబ‌ద్ధాలేన‌ని తేల్చేశారు. ఎవ‌రికి అవార్డులు వ‌చ్చాయి.. వారేం అనుకుంటారో త‌న‌కు అన‌వ‌స‌ర‌మ‌న్నారు. త‌న‌కు అవార్డులు రాన‌ప్పుడు అవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వ్యాఖ్యానించారు. .

గులాబీ లాంటి సినిమాకు నంది అవార్డు రాక‌పోవ‌టంపై స్పందిస్తూ.. తాను న‌టించిన గులాబీ ఒక్క‌టే కాద‌ని.. ఆ చిత్రానికి ముందు.. త‌ర్వాత కూడా మంచిచిత్రాల్లో న‌టించాన‌ని అయిన‌ప్ప‌టికీ త‌న‌కు అవార్డులు రాలేద‌న్నారు. అలాంట‌ప్పుడు తాను నంది అవార్డుల్ని ఎందుకు విశ్వ‌సిస్తాన‌ని ప్ర‌శ్నించారు. ఉన్న‌ట్లుండి స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌పై ఒకే స‌మ‌యంలో నాలుగు బ‌యోపిక్ లు రావ‌టం ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు స్పందించిన జేడీ.. ఎన్టీఆర్ మ‌హాన‌టుడ‌ని.. గొప్ప వ్య‌క్తి అని.. అలాంటి వ్య‌క్తిపై ఎవ‌రికి వారు వారికి న‌చ్చినట్లుగా సినిమాలు తీయ‌టం త‌ప్పు కాద‌న్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ బ‌యోపిక్ లో తాను న‌టించ‌టం లేద‌ని.. ఆ వార్త‌లు నిజం కాద‌న్నారు.

ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖ న‌టులు ప‌వ‌న్‌.. క‌మ‌ల్ హాస‌న్‌.. ఉపేంద్ర‌.. ర‌జ‌నీకాంత్ లాంటి వారు రాజ‌కీయాల‌పై ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌టం.. రానున్న ఎన్నిక‌ల గోదాలోకి దిగుతున్న నేప‌థ్యంలో జేడీ కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా? అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ త‌న‌కు పాలిటిక్స్ గురించి అస్స‌లు తెలీద‌ని.. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌న్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద అభిమానుల‌కున్న వీరాభిమానం గురించి వేసిన ప్ర‌శ్న‌కు జేడీ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ప‌వ‌న్ సినిమాల్ని చూసి ఆయ‌న‌పై అంత అభిమానం పెంచుకున్నార‌ని తాను అనుకోవ‌టం లేద‌ని.. ఆయ‌న చేసిన సామాజిక సేవే ఆయ‌న‌కు ఆ త‌ర‌హా ఇమేజ్‌కు కార‌ణ‌మ‌న్నారు. సినిమాలు చూసే ఓట్లు వేస్తార‌నుకోవ‌టం త‌ప్ప‌ని.. ప‌వ‌న్ బోలెడంత సామాజిక సేవ చేశార‌ని.. ఇదే ఆయ‌నపై ప్ర‌జ‌ల్లో అంత అభిమానం ఉండేలా చేసింద‌న్నారు.

రాంగోపాల్ వ‌ర్మ‌తో గొడ‌వ‌ల మీద అడిగిన ప్ర‌శ్న‌కు స్పందించిన జేడీ.. వ‌ర్మ త‌న‌కు ప్రేమికుడు.. భాగ‌స్వామి కాద‌ని.. అలాంట‌ప్పుడు మాత్ర‌మే గొడ‌వ‌లు.. విడిపోవ‌టం లాంటివి ఉంటాయ‌న్నారు. వ‌ర్మ త‌న‌కు గురువ‌ని.. గొడ‌వ‌లున్నాయ‌ని అన‌టం స‌రికాద‌న్నారు.
Tags:    

Similar News