రాజశేఖర్ కూతురు ఎవరితోనో లేచిపోయిందని రాశారు: జీవిత

Update: 2022-05-19 10:30 GMT
టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ దంపతులు ఇటీవల కాలంలో పలు విషయాల్లో వార్తల్లో నిలిచారు. గతేడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మొదలుకొని.. ఆ మధ్య 'గరుడవేగ' నిర్మాతలు చీటింగ్ కేసు పెట్టడం వరకు అనేక వివాదాల్లో జీవిత రాజశేఖర్ పేరు వినిపించింది. లేటెస్టుగా తాను డైరెక్ట్ చేసిన 'శేఖర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తన కూతుళ్ళ గురించి మాట్లాడుతూ చెప్పిన నానుడి పై కూడా కాంట్రవర్సీ చెలరేగింది.

ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన వివాదాల గురించి వివరణ ఇచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడటం తప్పితే.. ఎవరినైనా మోసం చేయడం గానీ.. ఎవరికైనా అన్యాయం చేసినట్లు చూసారా?.. అయినా తనపైన వచ్చినన్ని వార్తలు.. ఆరోపణలు మరెవరి మీద రావని ఆవేదన వ్యక్తం చేసింది.

'గరుడ వేగ' నిర్మాతలైన కోటేశ్వరరావు - హేమ.. సినిమాకి సంబంధించిన డబ్బులన్నీ తీసుకున్నారని.. కానీ వాళ్ళు మీడియా ముందుకొచ్చి తాము రూ.26 కోట్లు మోసం చేశారని ఆరోపణలు చేశారు. నిజానికి తాము కూడా ప్రొడక్షన్ లో సగం డబ్బులు ఆస్తులమ్మి మరీ పెట్టామని.. తమ వద్ద సాక్ష్యంగా చెక్ ఉందని జీవిత తెలిపారు. అయినా ఇవేమీ తెలుసుకోకుండా తాము మోసం చేసినట్టుగా మూడు నాలుగు రోజులు ఆ వార్తలు క్యారీ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.

''ఏదేమైనా ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టులో తేలకముందే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జీవిత రాజశేఖర్ అన్ని కోట్లు మోసం చేశారు అని ఏదేదో చెప్పారు. మీడియా వాళ్ళు అదే విధంగా దాన్ని ప్రొజెక్టు చేశారు. ఇలాంటివి చూసి జీవిత రాజశేఖర్ అంటే తెలిసిన వాళ్ళు అలా కాదు అని అనుకోవచ్చు. కానీ మా గురించి తెలియని ఎంతో మంది ఏమనుకుంటారు?'' అని జీవిత ప్రశ్నించారు. తాము నిజంగానే తప్పు చేశామని కోర్టులో తేలితే ఏ శిక్ష విధించినా తాము అంగీకరిస్తామని అన్నారు.

''నిన్న కాక మొన్న రాజశేఖర్ కూతురు ఎవరితోనో లేచిపోయింది అని రాశారు. కాసేపు శివాని అని.. కాసేపు శివాత్మిక అని.. మేమేదో దుబాయ్ కి ట్రిప్ కి వెళ్తే.. అక్కడ బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయిందని హెడ్డింగ్స్ పెట్టి రాశారు. లోపల చూస్తే ఆ న్యూస్ కి దానికి ఏమీ సంబంధం ఉండదు. ఇలాంటివన్నీ లైఫ్ ని ఎంతో ఎఫెక్ట్ చేస్తాయి'' అని జీవిత రాజశేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను అన్ని మీడియాలను అనడం లేదని.. ఓ వర్గం మాత్రం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

నిజంగా తాము ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించి రోడ్డు మీద నిలబెట్టి కొట్టినా అభ్యంతరం లేదని.. కానీ తామంటే పడని ఎవరో ఏదో ఆరోపణలు చేస్తే.. రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి వార్తలు రాస్తే తాము ఏమైపోవాలని జీవిత ప్రశ్నించారు. మొన్న జరిగిన ఇష్యూతో నేను చాలా సఫర్ అయ్యానన్నారు. ఎన్నో సమస్యలతో నెట్టుకొచ్చే ఉండేవారికి అలాంటి వాటిపై కేసు వేయడం అంటే అయ్యే పని కాదని జీవిత తెలిపారు.

'శేఖర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జీవిత రాజశేఖర్ తన కూతుళ్ళ గురించి చెప్తూ ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జీవిత ప్రస్తావిస్తూ.. తాను ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని.. చిన్నప్పటి నుంచి వింటున్న నానుడినే సాధారణంగా చెప్పానని అన్నారు. డబ్బులకు ఎంత విలువ ఇవ్వాలనేది వారిని చూసి నేర్చుకోవాలనే మంచి ఉద్దేశ్యంతోనే అన్నానని వివరణ ఇచ్చారు.

అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అని భావిస్తానని.. తన ఇద్దరు కూతుళ్ల కాలేజీ అడ్మిషన్ ఫార్మ్ లో కూడా క్యాస్ట్ అనే ఇండియన్ అని రాశానని జీవిత అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా కించపరిచి ఉంటే అందుకు క్షమాపణలు చెప్తున్నానన్నారు. ఈ వివాదంపై లైవ్ డిబేట్ పెట్టిన న్యూస్ ఛానల్ వారికి తనతో 25 ఏళ్లుగా పరిచయం ఉందని.. ఒక్కసారి తనని దీనిపై క్లారిటీ అడిగుంటే ఇది వివాదంగా మారి ఉండేది కాదని జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News