వర్మపై తుది గెలుపు తనదేనన్న పాల్‌

Update: 2019-12-14 12:04 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను అడ్డుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెల్సిందే. తనను అవమానించేలా సినిమాలో సీన్స్‌ ఉన్నాయని.. ఆ సీన్స్‌ తొలగించడంతో పాటు సినిమాను తమకు చూపించిన తర్వాత విడుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. కేఏపాల్‌ పిటీషన్‌ ను విచారించిన కోర్టు సెన్సార్‌ బోర్డు సభ్యులకు పాల్‌ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలంటూ సూచించింది.

పలు వివాదాల నడుమ విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై కేఏపాల్‌ ఎట్టకేలకు స్పందించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పాల్‌ ఆన్‌ లైన్‌ ద్వారా ఒక మీడియా సంస్థతో మాట్లాడాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కులాల మద్య చిచ్చు పెట్టే విధంగా వర్మ తీశాడు. ప్రజల మద్య గొడవలు పెట్టే విధంగా ఆయన సినిమాలు ఉన్నాయన్నాడు. వర్మ చెప్పేది సినిమాల్లో చూపించేది అన్ని కూడా అబద్దాలే అంటూ ఈ సందర్బంగా పాల్‌ అన్నాడు.

సెన్సార్‌ బోర్డు తాము అభ్యంతరం చెప్పిన సీన్స్‌ ను కట్‌ చేయడం జరిగింది.. దాంతో తుది గెలుపు తమకే దక్కింది అంటూ ఈ సందర్బంగా పాల్‌ చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నాడు. ఇప్పటికైనా పాల్‌ మమ్ములను క్షమాపణ కోరితే పర్వాలేదు లేదంటే చరిత్ర హీనుడిగా నిలిచి పోవడం ఖాయం అంటూ పాల్‌ హెచ్చరించాడు. ప్రపంచ శాంతి కోసం ప్రస్తుతం తాను అమెరికాలో ట్రంప్‌ సహా పలు దేశ అధ్యక్షులతో చర్చలు జరుపుతున్నట్లుగా కేఏ పాల్‌ అన్నాడు.
Tags:    

Similar News