తెలుగు ట్రెండును ఫాలో అవుతున్న రజనీ

Update: 2018-05-19 07:03 GMT
తెలుగు సినిమాల నిడివి విషయంలో ఈ మధ్య ట్రెండు మారింది. చాలా ఏళ్లుగా రెండు రెండుంబావు గంటల సినిమాల హవా సాగగా.. ఈ మధ్య కొన్ని సినిమాలు పెద్ద నిడివితో వచ్చి విజయం సాధించడంతో అదే బాటలో మిగతా సినిమాలూ నడుస్తున్నాయి. ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘సావిత్రి’.. ఈ సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితో ఉన్నవే. ‘నా పేరు సూర్య’ కూడా 2 గంటల 48 నిమిషాల లెంగ్త్ తో రిలీజైంది.

ఇదే బాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ కూడా సాగనుంది. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు సెన్సార్ పూర్తయింది. దీని నిడివి 2 గంటల 45 నిమిషాలని తేలింది. రజనీకాంత్-రంజిత్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘కబాలి’ కూడా పెద్ద సినిమానే. అది 2 గంటల 35 నిమిషాల నిడివితో ఉంటుంది. ‘కాలా’ ఇంకో పది నిమిషాలు ఎక్కువే ఉండబోతోంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో.. నిడివి విషయంలో జనాలు ఎలా ఫీలవుతారో చూడాలి.

‘కబాలి’ నిరాశపరిచిన నేపథ్యంలో రజనీ.. రంజిత్ తో మళ్లీ ఇంకో సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆయన మళ్లీ అతడికి అవకాశమిచ్చాడు. దాదాపుగా ‘కబాలి’ స్టయిల్లోనే కనిపిస్తున్న ‘కాలా’కు అనుకున్నంత బజ్ రాలేదు. ఏప్రిల్ 27నే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల జూన్ 7కు వాయిదా వేశారు. రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ‘కాలా’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.
Tags:    

Similar News