బాలయ్య పిలిచారు కానీ చిరు పిలవలేదు

Update: 2017-03-24 05:20 GMT
ఈ మాట అన్నది ఎవరో కాదు.. తెలుగుసినిమా రంగంలో వందలాది పాత్రల్ని పోషించటమే కాదు.. సీనియర్ నటుల్లో నేటికి ఉన్న అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ. తాజాగా ఆయనో ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రముఖులుగా చెప్పే వాళ్లు ఎలా వ్యవహరిస్తారు? దేనికి ప్రాధాన్యత ఇస్తారు? సీనియర్లు కోరుకునే చిన్న చిన్న విషయాల్ని ఎంత లైట్ గా తీసుకుంటారన్న ఆవేదన ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

తాజా ఇంటర్వ్యూలో కైకాల సత్యనారాయణ చెప్పిన ముచ్చట్లు చూస్తే..

రాఘవేంద్రరావు.. దాసరి నారాయణరావు.. కోడి రామకృష్ణ లాంటివారు అప్పట్లో డైరెక్టర్లు కాదు.. సహాయ దర్శకులు కూడా కాదు.. అసిస్టెంట్స్ డైరెక్టర్స్.అయితే..తర్వాతి కాలంలో వారు దర్శకులయ్యారు. ప్రేక్షకుల్ని ఆకర్షించే విషయం వారిలో ఉంది. కాబట్టే.. అన్నేసిసినిమాలు తీశారు. దాసరి దర్శకరత్న అయినా.. రాఘవేంద్రరావు అన్నేసి సినిమాలు తీశారంటే.. అంత పేరు ప్రఖ్యాతుల్నిసంపాదించారంటే వారిలో విషయం ఉండబట్టే అంటూ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశారు.

పదేళ్ల తర్వాత చిరంజీవి చేసిన ఖైదీ నెంబరు 150 సినిమాను చూశారా?అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నేను చూడలేదమ్మా. ఎందుకంటే ఆయన నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. సినిమా హాలుకు వెళితే.. ఒక పట్టాన సినిమాను చూడనివ్వరు. ఈలలు.. కేకలు. సినిమాను చూసే అవకాశం ఉండదు. పిల్లల్లో ఈ మధ్యన దెప్పటం ఎక్కువైంది. అప్రిషేట్ చేయటం మానేశారు.అందుకే.. వెళ్లలేదు.బాలకృష్ణ ఫర్వాలేదు. కావాలని ఓల్డ్ టైమర్స్ కు సినిమా వేశారు. ఓల్డ్ ఆర్టిస్టులు.. మాలాంటి వాళ్లమంతా వెళ్లగలుగుతాం’’ అని చెప్పుకొచ్చారు.

శాతకర్ణి సినిమాకు బాలకృష్ణ ఫోన్ చేసి పిలిచారని..అందుకే తాను వెళ్లిచూసినట్లు కైకాల వెల్లడించారు. మద్రాస్ లో ఆనవాయితీ ఏమిటంటే.. ప్రివ్యూ వేసేవారని..ఓల్డ్ టైమర్స్ కు కూడా ఒక షో వేసే వారన్నారు. ఇప్పుడదంతా పోయిందని.. ఓల్డ్ టైమర్స్ ను పట్టించుకోవటం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పెద్దోళ్ల కోసం ఒక షో వేస్తే ఏం పోయింది? పిలిస్తే వారెంత ఆనందిస్తారు. ఈ విషయాన్ని చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ లాంటి చాలామందితో చెప్పా. అయినా వేయరు. ఓల్డ్ టైమర్స్ కోసం.వారి తృప్తి కోసం.. వారి గౌరవం కోసం వేయొచ్చుగా.ఎవ్వరూ పట్టించుకోలా’’ అని అన్నారు.

సినిమాలు చేయని వారిని పరిశ్రమలో పట్టించుకోరన్నది నిజమేనా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అక్షరాలా నిజమని.. ఇంకాఅర్థమయ్యేలా చెప్పాలంటే అంటూ.. ‘‘మొన్నసుబ్బిరామిరెడ్డి ఇంట్లోఫంక్షన్ జరిగింది. చాలామందిని పిలిచారు.పొలిటికల్ గా ఎవరు పెద్దోళ్లు.. వాళ్లు.. పెద్ద హీరోలే తప్పించి వేరెవరూ కనిపించరు. అల్లుఅర్జున్ నిన్నగాక మొన్న వచ్చిన కుర్రాడే కదా. అమితాబ్ బచ్చన్.. రజనీకాంత్.. చిరంజీవి..బాలకృష్ణ..పవన్ కల్యాణ్..అల్లుఅర్జున్.. హీరోలు.. మిగిలినవారంతా రాలేదే?మేం ముఖ్యమైన వాళ్లం కాదా? ఏమైపోయింది మా పేరు. 50 ఏళ్ల నుంచి ఉన్నాం. ఎవరైతే లైమ్ లైట్ లో ఉంటారో వాళ్లనే చూస్తారు.వాళ్లనే పిలుస్తారు. ఇది అక్షరాల నిజం. ఇలాంటివి ఎదురైనప్పుడు బాధ పడతాం.అంతకుమించి ఏం చేయగలం? సామెత చెప్పినట్లు కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుంటుంది’’ అంటూ చిత్ర పరిశ్రమలోని వాస్తవాల్ని వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News