మూవీ రివ్యూ : కళ్యాణ వైభోగమే

Update: 2016-03-04 16:02 GMT
చిత్రం : కళ్యాణ వైభోగమే

నటీనటులు- నాగశౌర్య, మాళవిక నాయర్, రాశి, ఆనంద్, ఆశిష్ విద్యార్థి, ఆర్జే హేమంత్, రాజ్ మాదిరాజు తదితరులు
సంగీతం- కళ్యాణి కోడూరి
ఛాయాగ్రహణం- జీవీఎస్ రాజు
మాటలు- లక్ష్మీభూపాల్
నిర్మాత- దామోదర్ ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- నందిని రెడ్డి

దర్శకురాలిగా తన తొలి సినిమా ‘అలా మొదలైంది’తో వచ్చిన పేరంతా.. రెండో సినిమా ‘జబర్దస్త్’తో పోగొట్టుకుంది నందిని రెడ్డి. ఇక నిర్మాత దామోదర్ ప్రసాద్ ‘హోరాహోరీ’తో కంగుతిన్నాడు. హీరో నాగశౌర్య సైతం జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి లాంటి సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. వీళ్ల ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కిన ‘కళ్యాణ వైభోగమే’ ఆసక్తి రేపింది. మంచి ఫీల్ గుడ్ మూవీలాగా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: శౌర్య (నాగశౌర్య) బీఎస్సీ పూర్తి చేసి.. అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న కుర్రాడు. దివ్య (మాళవిక) ఎంబీబీఎస్ చదువుతూ.. ఆ తర్వాత ఫారిన్లో ఎండీ చదవాలని కోరుకుంటున్న అమ్మాయి. వీళ్లిద్దరికీ అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ల తల్లిదండ్రులు మాత్రం పెళ్లి కోసం తొందర పెడుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ పెళ్లికి సిద్ధమవుతారు. పెద్ద వాళ్ల కోసం పెళ్లి చేసుకున్నా.. తర్వాత విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్లు చూసుకోవాలన్నది వాళ్ల ప్లాన్. అనుకున్నట్లే పెళ్లి చేసుకుని.. ఆ తర్వాతి రోజే విడాకుల కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. మరి వాళ్లు కోరుకున్న ప్రకారం వారు విడిపోయారా లేదా.. వాళ్ల ప్లాన్ వర్కవుటైందా లేదా.. అన్నది తెర మీదే చూడాలి.

కథనం, విశ్లేషణ: అక్క‌డో పెళ్లి జ‌రుగుతుంటుంది. పెళ్లికొడుకు మావ‌య్య పెళ్లికూతురు తండ్రి ద‌గ్గ‌రికెళ్లి ఏంటండీ.. పెళ్లి ఇంత సింపుల్ గా చుట్టేస్తున్నారు అంటాడు. అంత‌లో పెళ్లికొడుకు తండ్రి ఎంట‌ర‌వుతాడు. పెళ్లి అనేది మ‌న‌వాళ్ల మ‌ధ్య మ‌న‌మంతా క‌లిసి చేసుకునే వేడుక అని.. మ‌న‌కు ఎంత డబ్బు, ప‌ర‌ప‌తి ఉందో చూపించడానికి కాదంటూ సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుల్లో సైతం ఆలోచ‌న క‌లిగించేలా రియ‌లిస్టిగ్గా కొన్ని మాట‌లు చెబుతాడు. ఆ స‌న్నివేశం చూస్తుంటే మ‌నం థియేట‌ర్లో కాకుండా అక్క‌డే ఉండి నిజంగానే ఆ మాట‌ల్ని వింటున్నామా అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ‘క‌ళ్యాణ వైభోగ‌మే’లో ఇలా ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట‌యిపోయే పాత్ర‌లు, స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి.

ఈ త‌రం యూత్ కు ప్ర‌తిబింబాల్లా అనిపించే హీరో హీరోయిన్లు.. హుందాత‌నం ఉన్న హీరోయిన్ తండ్రి.. కొడుక్కి పెళ్లి చేసే వ‌య‌సులో అమ్మాయిల‌తో చాటింగ్ చేస్తూనే అవ‌స‌ర‌మైన‌పుడు పెద్ద‌రికం చాటుకునే హీరో తండ్రి.. కోపం వ‌స్తే వంట‌గ‌దిలోకి దూరిపోయి అతిగా వండేసే హీరో త‌ల్లి.. క‌మ్యూనికేష‌న్ లేని తండ్రీకూతుళ్ల మ‌ధ్య వార‌ధిగా నిలిచే హీరోయిన్ త‌ల్లి.. ఇలా ప్ర‌తి పాత్ర‌కూ ఓ క్యారెక్ట‌రైజేష‌న్‌.. యూత్ ను ఆక‌ట్టుకునే ఫ‌న్ ఫిల్డ్ రొమాన్స్‌.. ఫ్యామిలీస్ ను మెప్పించే ఎమోష‌న్స్.. మొత్తంగా ఓ ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్ ‘క‌ళ్యాణ వైభోగ‌మే.

కొన్ని క‌థ‌లు కొత్త‌గా ఉండి ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి. ఇంకొన్ని క‌థ‌లు రొటీన్ గా ఉంటూనే క‌థ‌నంలో కొత్త‌ద‌నంతో ఆక‌ట్టుకుంటాయి. క‌ళ్యాణ వైభోగ‌మే రెండో కోవ‌కే చెందుతుంది. పెళ్లి మీద వ్య‌తిరేక‌త‌తో ఉన్న ఓ జంట‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకుని, అపార్థాలు, గొడ‌వ‌ల త‌ర్వాత ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని చివ‌రికి ప్రేమ‌లో ప‌డి ఒక్క‌ట‌య్యే క‌థ‌తో ‘పెళ్లైన కొత్త‌లో’ లాంటి కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. ఆ త‌ర‌హా క‌థ‌తోనే నందిని రెడ్డి ఆహ్లాద‌క‌ర‌మైన క‌థ‌నంతో ‘క‌ళ్యాణ వైభోగ‌మే’ను ప్ర‌త్యేక‌మైన సినిమాగా తీర్చిదిద్దింది. ఎక్క‌డా మెలో డ్రామాకు అవ‌కాశం లేకుండా నిజంగా మ‌న చుట్టూ జ‌రుగుతున్న‌ట్లే స‌హ‌జంగా స‌న్నివే​శాల్ని తీర్చిదిద్ద‌డం సినిమాకున్న పెద్ద ప్ల‌స్ పాయింట్‌.

ఒక ఫ్యామిలీలో హిడెన్ కెమెరాలు పెట్టి క్యాప్చ‌ర్ చేసినట్లు పాత్ర‌ల‌న్నీ స‌హ‌జంగా ప్ర‌వ‌ర్తిస్తాయి. ఒరిజిన‌ల్ గా అనిపించే హావ‌భావాలు ప‌లికిస్తాయి. నిజ‌మైన ఎమోష‌న్ల‌ను మనం ఫీల‌వుతాం. పెళ్లి, కెరీర్ విష‌యంలో హీరో హీరోయిన్ల ఆలోచ‌న‌లు కొంచెం ఎక్స్ ట్రీమ్ గా... త‌ల్లిదండ్రుల ప‌ట్టుద‌ల కొంచెం టూమ‌చ్ గా అనిపిస్తాయి కానీ.. వాటిని ప‌క్క‌న‌బెట్టేస్తే మిగ‌తా ఎమోష‌న్లన్నీ కూడా స‌హ‌జంగా అనిపిస్తాయి. ప్ర‌తి పాత్ర‌కూ ఓ ఐడెంటిటీ ఉండ‌టంతో వాటితో ఈజీగా క‌నెక్ట‌యిపోతాం. పేలిపోయే కామెడీ లేకున్నా.. సింపుల్ హ్యూమ‌ర్ తోనే ప్రేక్ష‌కుల ముఖాల‌పై చిరున‌వ్వు నిలిచి ఉండేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దింది నందిని రెడ్డి.

హీరో హీరోయిన్లు స‌హా పాత్ర‌ల ప‌రిచ‌యం.. ఆ త‌ర్వాత పెళ్లి చూపులు.. పెళ్లి చెడ‌గొట్టుకునే స‌న్నివేశాలు.. ఆపై ఇద్ద‌రికీ వేరే చూపుల‌కు సంబంధించిన సీన్స్ అన్నీ కూడా స‌ర‌దాగా సాగిపోవ‌డంతో ప్ర‌థ‌మార్ధం ర‌య్యిన దూసుకెళ్తుంది.ఇక పెళ్లికి సంబంధించిన స‌న్నివేశాలు కొంచెం ఎమోష‌న‌ల్ గా సాగుతాయి. వాటితో కూడా ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట‌యిపోవ‌డంతో చూస్తుండ‌గానే ప్ర‌థ‌మార్ధం అయిపోతుంది. ఉత్కంఠ రేపే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ తో ప్ర‌థ‌మార్ధం ముగుస్తుంది.

ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఎక్కువ ప్రెడిక్ట‌బుల్ గా ఉండ‌టం.. కొంచెం సాగ‌దీసిన ఫీలింగ్ క‌ల‌గ‌డంతో సినిమా గ్రాఫ్ కొంచెం ప‌డిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది కానీ.. నిరాశ చెందేలా మాత్రం ఉండ‌దు.ఫీల్ మాత్రం కంటిన్యూ అవుతుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య దూరం త‌గ్గి వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ప్రిక్లైమాక్స్ లో ఎమోష‌న్ బాగా పండింది. ఇక క్లైమాక్స్ విష‌యంలో నందిని రెడ్డి అలా మొద‌లైంది ఫార్ములా ఫాలో అయిపోయింది. తాగుబోతు ర‌మేష్ పాత్ర‌ను ప్ర‌వేశ‌పెట్టి స‌ర‌దాగా సినిమాను ముగించే ప్ర‌య‌త్నం చేసింది. ఎక్క‌డా అస‌భ్య‌త‌కు తావు లేకుండా సినిమాను క్లీన్ ఎంట‌ర్టైన‌ర్ గా తీర్చిదిద్ద‌డం కూడా సినిమాకున్న ప్ల‌స్ పాయింట్‌. ‘క‌ళ్యాణ వైభోగ‌మే’లో చెప్పుకోద‌గ్గ నెగెటివ్ పాయింట్స్ అంటే.. క‌​థ​
​ ​
ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా ఉండ‌ట‌మే. సినిమా మొద‌లైన‌పుడే క‌థ ఎప్పుడు ఏ మ‌లుపు తీసుకుంటుందో.. ఎలా సాగుతుందో.. ఎలా ముగుస్తుందో ఓ అంచ‌నా వచ్చేయొచ్చు. దాదాపుగా ఆ అంచ‌నాకు త‌గ్గ‌ట్లే సినిమా న‌డుస్తుంది. సినిమా అంతా ఉన్న ఫీల్ తో సాగి చివ‌రికి వ‌చ్చేస‌రికి మామూలుగా ముగియ‌డం కూడా నెగెటివ్ పాయింటే. మ‌నం ఇంకా ఎక్కువే ఆశిస్తాం కానీ.. నందిని రెడ్డి మామూలుగా ముగించేసింది. అనుకున్నంత స్థాయిలో ఎమోష‌న్లు పండ‌లేదు. క్లైమాక్స్ మామూలుగా అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా కొంచెం ఎక్కువైంది.

నటీనటులు: కథకు తగ్గట్లు మంచి నటీనటుల్ని ఎంచుకోవడంలోనే నందిని రెడ్డి సగం విజయం సాధించింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. నాగశౌర్య, మాళవికల జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. వాళ్లిద్ద‌రి కెమిస్ట్రీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఇద్దరూ కూడా నేటితరం అబ్బాయి-అమ్మాయిగా చక్కగా సరిపోయారు. అందం, అభినయం రెండింట్లోనూ ఆకట్టుకున్నారు. పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. ముఖ్యంగా మాళ‌వికతో త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. నిత్యామీన‌న్ త‌ర‌హాలో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసే ప్ర‌తిభ ఆమె సొంతం. ఆనంద్, రాశి హుందాగా న‌టించారు. ఐశ్వ‌ర్య కూడా ఆ పాత్ర‌కు ప్ర‌త్యేక‌త చేకూర్చింది. న‌ట‌న కొత్త‌యిన‌ప్ప‌టికీ రాజ్ మాదిరాజు కూడా త‌డ‌బాటు లేకుండా న‌టించాడు.

సాంకేతిక వ‌ర్గం: న‌టీన‌టుల్లాగే సాంకేతిక నిపుణులు కూడా సినిమాకు బ‌లంగా నిలిచారు. సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణి కోడూరి, ఛాయాగ్రాహ‌కుడు బీవీఎస్ రాజు.. సినిమాలో మంచి ఫీల్ తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. క‌ళ్యాణి పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం కూడా చాలా ఆహ్లాదాన్నిచ్చాయి. రాజు విజువ‌ల్స్ కూడా అంతే. సినిమా చాలా క‌ల‌ర్ ఫుల్ గా రావ‌డంలో కెమెరా ప‌నిత‌నం కీల‌కం. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దామోద‌ర్ ప్ర‌సాద్ త‌న అభిరుచిని మ‌రోసారి చాటుకున్నారు. ల‌క్ష్మీ భూపాల్ మాట‌లు, పాట‌లు క్యాచీగా, స‌హ‌జంగా ఉన్నాయి. స‌న్నివేశాల‌కు త‌గ్గ మాట‌లే కానీ.. అన‌వ‌స‌ర‌, అస‌హ‌జ‌మైన డైలాగ్స్ లేవు. ఇక ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి.. మ‌ళ్లీ అలా మొద‌లైంది ఫ్లేవ‌ర్ తీసుకొచ్చింది. ఆమె మార్కు సింపుల్ హ్యూమ‌ర్ తో సినిమాను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దింది. క్యారెక్ట‌ర్ల‌ను స‌రిగ్గా తీర్చిదిద్దుకుంటే ఆటోమేటిగ్గా క‌థ‌నం కూడా ఆస‌క్తిక‌రంగా త‌యార‌వుతుంద‌ని నందిని చూపించింది. ఆహ్లాద‌క‌ర‌మైన క‌థ‌నం రాసుకోవ‌డంతో పాటు దాన్ని స‌మ‌ర్థంగా తెర‌కెక్కించ‌డంలో ఆమె విజ‌యం సాధించింది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా త‌న టేస్టుకు త‌గ్గ‌ట్లు ఔట్ పుట్ రాబ‌ట్టుకుని ద‌ర్శ‌కురాలిగా త‌న‌దైన ముద్ర వేసింది నందిని.

చివరగా: క‌ళ్యాణ వైభోగమే.. సింపుల్ బ‌ట్ బ్యూటిఫుల్‌

రేటింగ్​ ​-​ 3/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News