కమల్ సినిమా రెండు రోజులు లేటుగా..

Update: 2015-10-31 08:55 GMT
కమల్ హాసన్ తమిళంలోనే కాదు.. తెలుగులోనూ భారీగా అభిమాన గణం ఉంది. మన స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎలా ఎదురు చూస్తారో.. కమల్ సినిమాల కోసం కూడా ఇక్కడి అభిమానులు అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తారు. ‘ఉత్తమ విలన్’ ఓవరాల్ గా ఫ్లాప్ అయినప్పటికీ కమల్ అభిమానుల్ని మాత్రం బాగానే ఆకట్టుకుంది. విశ్వనాయకుడి అద్భుత నటనా కౌశలాన్ని తనివితీరా ఆస్వాదించారు ఆయన ఫ్యాన్స్. తెలుగులో తన ఫాలోయింగ్ ఏంటో కమల్ కు కూడా బాగానే తెలుసు. అందుకే చాన్నాళ్ల నుంచి చెబుతున్నట్లే ఈసారి తన కొత్త సినిమాను తెలుగులోనూ తీశాడు కమల్. తమిళంలో ‘తూంగావనం’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో రానుంది. ఈ సినిమాకు కమల్ స్వయంగా తనే డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు.

మామూలుగా అయితే కమల్ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతాయి. ఐతే ‘చీకటి రాజ్యం’ను మాత్రం తెలుగులో రెండు రోజులు లేటుగా రిలీజ్ చేస్తున్నారు. నవంబరు 10న తమిళంలో విడులవుతుండగా.. తెలుగు వెర్షన్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీనికి కారణమేంటో తెలియట్లేదు. 11న అఖిల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ రోజు మాగ్జిమం థియేటర్లు బ్లాక్ చేయాల్సి రావడంతోనే ఆ మరుసటి రోజు ‘చీకటి రాజ్యం’ను విడుదల చేస్తుండొచ్చేమో. కమల్ శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించిన ‘చీకటి రాజ్యం’లో త్రిష - ప్రకాష్ రాజ్ - సంపత్ రాజ్ - కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక్క రాత్రిలో ముగిసిపోయే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

Tags:    

Similar News