కమల్ సార్.. యాంటీస్ మీద పడ్డాడు

Update: 2015-11-20 07:20 GMT
కమల్ హాసన్ సినిమా అంటే చాలు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ముడిపడి ఉంటుంది. ఈ వివాదాల మూలంగా ఆయన సినిమాలకు చాలాసార్లు అడ్డంకులు ఎదురయ్యాయి. వివాదాస్పద అంశాల మీద, బర్నింగ్ ఇష్యూస్ మీద సినిమాలు తీయడం.. తాను చెప్పాలనుకున్న విషయంలో రాజీ పడకపోవడం వల్ల కమల్ చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విశ్వరూపం విషయంలో అయితే మీడియా ముందు కన్నీళ్లు పెట్టకున్న పరిస్థితి. ‘ఉత్తమ విలన్’కు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు. ఐతే ఇలా సినిమాల్ని అడ్డుకునే వాళ్లను ఊరికే వదిలేయలేదు కమల్. తన కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’లో ఇలా అనవసరంగా సినిమాలకు అడ్డుపడే వాళ్లను ఉద్దేశించి ఓ క్యారెక్టర్ పెట్టాడు కమల్. ఆ పాత్ర పోషించింది గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కావడం విశేషం.

ఈ క్యారెక్టర్ నైట్ క్లబ్బులో మందు కొడుతూ.. తనకు నచ్చని సినిమాను ఎలా అడ్డుకున్నానో చెబుతూ ఉంటుంది. తీస్తే కామెడీ సినిమాలు తీయాలి కానీ.. సందేశాలివ్వడమేంటి.. అందుకే ఆ సినిమా విడుదల కాకుండా ఆపేశా అంటంది ఆ పాత్ర. ఐతే చివర్లో అతను అడ్డుకున్న సినిమాకు క్లియరెన్స్ వచ్చేసిందని, విడుదలకు మార్గం సుగమం అయిందని టీవీలో న్యూస్ వస్తుంది. అది చూసి.. అదేంటి సినిమా విడుదలైపోతోందా అంటాడు ఆ వ్యక్తి. కమల్ అతణ్ని తోసేసి ముందుకెళ్లిపోతాడు. తన సినిమాల్ని అడ్డుకునే వాళ్ల నైజాన్ని ఇలా చూపించి.. వాళ్లను సుతి మెత్తగా బాగానే హెచ్చరించాడు కమల్.
Tags:    

Similar News