క్రిష్ కంచెకి అడిష‌న‌ల్ ప్రాఫిట్!

Update: 2015-11-01 08:17 GMT
ఈరోజుల్లో మంచి సినిమాని తీసి విజ‌యం అందుకోవ‌డం చాలా క‌ష్టం. క‌మ‌ర్షియాలిటీ పేరుతో ప్రేక్ష‌కుల్ని మాస్ మ‌సాలా సినిమాల‌కి అల‌వాటు చేశారంతా. అందుకే కాస్త క‌థాబ‌లంతో వ‌చ్చే మంచి సినిమాల్ని డాక్యుమెంట‌రీలు అన‌డం అల‌వాటైపోయింది. అయినా స‌రే...  అభిరుచిగ‌ల ద‌ర్శ‌కులు త‌మ ప్ర‌య‌త్నాల్ని తాము చేస్తూనే ఉన్నారు. ఎంత రిస్క‌యినా స‌రే మంచి సినిమాని తీయ‌డ‌మే ల‌క్ష్యం  అంటూ ప్ర‌యాణం చేస్తుంటారు. ఆ త‌ర‌హా ద‌ర్శ‌కుల్లో క్రిష్ ఒక‌రు. ఈయ‌న తొలి నుంచీ మ‌నుషుల క‌థ‌ల్నీ, మాన‌వీయ అనుబంధాలనీ తెర‌పై చూపిస్తుంటారు.  అదే కోవ‌లో ఇటీవ‌ల `కంచె` సినిమాని తీసి విడుద‌ల చేశారు.

సాధార‌ణంగానే కంచెకి కూడా  తొలి రోజు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయినా స‌రే క్రిష్ ఏమాత్రం నిరుత్సాహప‌డ‌కుండా త‌న‌వంతుగా సినిమాని ప్ర‌మోట్ చేసి విజ‌యం బాట ప‌ట్టించాడు. సినిమాకి పెట్టిన పెట్టుబ‌డి ఇప్ప‌టికే తిరిగి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది.   ఓవ‌ర్సీస్‌ లోనూ కంచెకి  ఆశాజ‌న‌క‌మైన వ‌సూళ్లు వ‌చ్చాయి. తెలుగులో భారీగా  క్రేజున్న సినిమాలు విడుద‌ల‌వ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఆ లోపు కంచె మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌ట్టుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈలెక్క‌న క్రిష్ కంచెకి మంచి లాభాలే వ‌స్తాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అదంతా ఒకెత్తైతే ఇటీవ‌ల సినిమాకి శాటిలైట్ రైట్స్ రూపేణా కూడా మంచి బిజినెసే  జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మా టీవీ రూ.4.6 కోట్ల‌కు ఈ సినిమాని కొనుగోలు చేసింద‌ట‌. సినిమా విడుద‌ల‌కు ముందు మ‌రో టీవీ ఛాన‌ల్ రూ.4 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ట‌. కానీ క్రిష్ మాత్రం అప్ప‌ట్లో సినిమాని అమ్మ‌లేదు. మంచి సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కంతోనే ఆయ‌న రైట్స్ అట్టిపెట్టుకొన్నారు. ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. కంచెకి అడిష‌న‌ల్ ప్రాఫిట్స్ వ‌చ్చిన‌ట్ట‌యింది.
Tags:    

Similar News