ఆ రోజు క్వీన్ విసిరే బాంబ్!?

Update: 2018-09-30 07:10 GMT
ఎన్నో అవాంత‌రాలు.. మ‌రెన్నో వ్య‌తిరేక‌త‌లు..
డైరెక్ట‌ర్ అలిగాడు.. కాస్టింగ్‌లో కీరోల్స్ మిడిల్ డ్రాప్..
నిర్మాతలు ఎగిరిపోయార‌ని ఊక‌దంపుడు ప్ర‌చారం...
ద‌ర్శ‌కుడితో పాటు కీల‌కపాత్ర‌ధారులు ఎటో వెళ్లిపోయారు..
ఆవిడ ఫింగ‌రింగ్ భ‌రించ‌లేకే... అంటూ సూటిపోటి కామెంట్లు..
 అన్నిటినీ భ‌రించి.. ఏం జ‌రిగినా త‌న‌కేమీ కాన‌ట్టు.. చీమ అయినా కుట్ట‌న‌ట్టు..ప‌రిస్థితుల‌కు ఎదురెళ్లి.. ధీర‌త్వం చాటుకుని.. ఎట్ట‌కేల‌కు తాను న‌మ్మిన సిద్ధాంతాన్ని గెలిపించుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది క్వీన్ కంగ‌న‌. పొర‌పొచ్చాల‌తో ద‌ర్శ‌కుడు క్రిష్ వ‌దిలేసిన ప్రాజెక్టును తానే చేప‌ట్టి, ద‌ర్శ‌కురాలిగానూ స‌త్తా చాటేందుకు అడుగులు వేసింది.

అందుకే క్వీన్ కంగ‌న గురించి - మ‌ణిక‌ర్ణిక ఎపిసోడ్స్ గురించి గ‌త కొంత‌కాలంగా దేశ‌వ్యాప్తంగా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స‌రిగ్గా ఇలాంటి వేళ కంగ‌న మ‌రో బాంబ్ వేయ‌బోతోంది. అదేంటి? అంటే .. మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్‌ ని గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న‌ రిలీజ్ చేసి త‌న వ్య‌తురేకులంద‌రికీ ఝ‌ల‌క్ తినిపించే రేంజులో ప్లాన్ చేసింది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలు ఝాన్సీ క్వీన్ లోని అన్ని ల‌క్ష‌ణాలు రియాలిటీలో త‌న‌కు ఉన్నాయ‌ని నిరూపించ‌బోతోంది. ఎల్లుండే.. ఝాన్సీ రాణి వీర‌త్వంపై ఫ‌స్ట్ టీజ‌ర్ వ‌స్తోంది కాబ‌ట్టి అంద‌రిలోనూ ఒక‌టే ఉత్కంఠ‌.

అయితే ఆ వేడుక‌లో కంగ‌న అగ్గిమీద గుగ్గిలం అవుతుందా? త‌న‌ను వ్య‌తిరేకించిన‌ - క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ పెట్టుకున్న‌వారంద‌రిపైనా ఎమోష‌న‌ల్‌గా విరుచుకుప‌డుతుందా? ద‌ర్శ‌కుడు క్రిష్ గురించి కెలుకుతుందా?  సోనూసూద్‌ ని ఆడుకుంటుందా?  మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోయార‌ని చెబుతున్న  నిర్మాత‌లపైనా ఏదైనా క్లారిటీ ఇస్తుందా? కాస్త ఓపిగ్గా వేచి చూడాలి. అన్నిటికీ మించి త‌న రైవ‌ల్ మూవీ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` టీజర్ వ‌చ్చేసింది కాబ‌ట్టి - అంత‌కుమించి త‌న టీజ‌ర్‌ లో ఈ అమ్మ‌డు ఏం చూపించ‌బోతోంది? అన్న‌ది చూడాలి. జ‌న‌వ‌రిలో `మ‌ణిక‌ర్ణిక‌` రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతోనే టీవీ న‌టి అంకిత లోఖండే వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.
    

Tags:    

Similar News