పూరిగారి దగ్గరికి వెళితే బౌన్సర్లు లాగేశారు: హీరో కార్తికేయ

Update: 2021-03-31 01:30 GMT
కార్తికేయకి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ హిట్ ను అందుకున్న కార్తికేయ, ఆ తరువాత ఏడాది వరుసగా నాలుగు సినిమాలు చేయడం విశేషం. అయితే సినిమాల సంఖ్య కంటే విజయాల సంఖ్య ముఖ్యమనే విషయం ఆయన వెంటనే గ్రహించాడు. ఆ తరువాత నుంచి కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాడు. ఒక వైపున హీరోగా తన స్థాయిని పెంచుకుంటూనే, నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

" నేను హీరోగా అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలోనే ఒక చోటున పూరిగారిని కలిశాను. అప్పుడు ఆయన "ఒకసారి ఆఫీసుకి వచ్చి కనపడమ్మా" అన్నారు. ఆయన ఆఫీసుకి వచ్చి కలవమన్నారు గదా అనే ఉద్దేశంతో నేను మంచిగా తయారై ఆఫీసుకి వెళ్లాను. అక్కడున్న వాచ్ మన్ నన్ను లోపలికి పంపించలేదు. ఇక లాభం లేదు .. పూరిగారు షూటింగులో ఉండగానే కలవాలని చెప్పేసి, 'జ్యోతిలక్ష్మీ' షూటింగు జరుగుతున్న చోటుకు వెళ్లాను. పూరిగారి దగ్గరికి వెళ్లకుండా బౌన్సర్లు లాగేశారు. వాళ్లసలు నన్ను ముందుకు వెళ్లనీయడం లేదు. పూరిగారు నన్ను చూస్తే గుర్తుపడతారు అనుకున్నాను.

అదే సమయంలో పూరిగారు నా వైపు చూశారు .. "సార్ .. నన్ను గుర్తుపట్టారా .. ఆ రోజు మిమ్మల్ని కలిశాను .. మీరేమో ఆఫీసుకి రమ్మన్నారు" అన్నాను. ఆయన నా వైపు చూసి .. "ఎవరు నువ్వు?" అన్నారు. ఒకసారి అలా కలిసేసి వెళ్లిపోతే వాళ్లకి గుర్తుండమనే సంగతి నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నన్ను బౌన్సర్లు లాగేస్తుండటం చూసిన ఆయన పిలిచి .. నా ఫోన్ నెంబర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ కి ఇచ్చేసి వెళ్లామన్నారు. ఏదైనా అవకాశం ఉంటే చెబుతాములే అన్నారు" అంటూ ఆ రోజున జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు.


Tags:    

Similar News