నేడు ఎల్లమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు

Update: 2021-07-11 08:30 GMT
రోడ్డు ప్రమాదంలో గాయపడిన నటుడు, సినీ రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ (45) చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కు తల, కళ్లకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ నిర్వహించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

తాజాగా చెన్నై నుంచి కత్తి మహేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామానికి తరలించారు. ఆ స్వగ్రామంలోనే ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.దీని కోసం బంధువులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు కత్తి మహేష్ అంత్యక్రియలు పూర్తవుతాయని బంధువులు తెలిపారు.

కత్తి మహేష్ తెలుగు నాట సినీ విమర్శకుడిగా పాపులర్ అయ్యారు. అనంతరం పలు సినిమాల్లోనూ నటించాడు. గత కొంతకాలంగా జనసేన, టీడీపీలను విమర్శిస్తూ వైసీపీకి మద్దతుగా కత్తి మహేష్ రాజకీయం చేశారు. పలు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఈ సాయం చేసింది. కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి ‘సీఎంఆర్ఎఫ్’ కింద రూ.17 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

కోల్ కతాకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త సోనాలికను కత్తి మహేష్ వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కత్తి మహేష్, భార్య సోనాలిక మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వారు కొంతకాలం క్రితం స్నేహపూర్వకంగా విడిపోయారు.

సోనాలిక ప్రస్తుతం భోపాల్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. విడిపోయినప్పటికీ మహేష్ కు.. భార్య సోనాలికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బంధువులు పేర్కొన్నారు. 
Tags:    

Similar News