రామ్ హీరోయిన్ కి భయానక అనుభవం

Update: 2015-12-10 06:07 GMT
చెన్నై వరదలకు చిన్నా పెద్దా అనే తేడా ఏమీ కనిపించలేదు. సిద్ధార్థ్ - ఖుష్బు లాంటి సెలబ్రెటీలు సైతం ఈ వరదల్లో చిక్కుకుని చాలా ఇబ్బంది పడ్డారు. ఐతే వీళ్ల సంగతి అప్పటికప్పుడే అందరికీ తెలిసింది కానీ.. ఇంకా మీడియా దృష్టికి రాని కథలు చాలా ఉన్నాయి. అందులో మలయాళ కుట్టి కీర్తి సురేష్ కథ ఒకటి. తెలుగులో రామ్ సరసన ‘నేను శైలజ’లో నటిస్తున్న కీర్తి.. వరదల సందర్భంగా భయానకమైన అనుభవం ఎదుర్కొందట. ఆ అనుభవం గురించి తన ట్విట్టర్ అకౌంట్లో పెద్ద పోస్ట్ పెట్టింది కీర్తి. ఆ పోస్ట్ చదివితే ఓ హీరోయిన్ అయి ఉండి ఆమె ఇంత ఇబ్బంది పడిందా అని ఆశ్చర్యం కలగడం ఖాయం.

గత నెల వరకు రామ్ సినిమా షూటింగులోనే ఉన్న కీర్తి.. ఈ నెల 4న తాను హీరోయిన్ గా నటించిన ‘రజినీ మురుగన్’ విడుదలవుతున్న నేపథ్యంలో చెన్నైలోని తన ఇంటికి వెళ్లిందట. పైగా అదే సమయంలో ఆమె బామ్మకు ఓ సర్జరీ కూడా చేయించాల్సి వచ్చిందట. తమ ఫ్లాట్ కి దగ్గర్లో ఉన్న ఎంఐఓటీ అనే హాస్పిటల్లో ఆమెను చేర్చాక.. అక్కడ ఒకరికి మించి ఉండొద్దని వైద్యులు చెప్పడంతో తన తల్లిని అక్కడే ఉంచి.. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చిందట కీర్తి.

రాగానే భారీ వర్షం పడటంతో తమ ఫ్లాట్లోకి నీళ్లు వచ్చేశాయని.. తర్వాత పవర్ పోయిందని.. ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఆ నీళ్లలోనే రెండు రోజుల పాటు ఉన్నామని.. ఓ ఐలాండ్ లో ఉన్నట్లు అనిపించిందని.. తన తల్లి, బామ్మ ఏమయ్యారో సమాచారం కూడా తెలియలేదని.. ఫోన్లు కూడా పని చేయలేదని.. చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నామని.. రెండు రోజుల తర్వాత తన తల్లి, బామ్మ కలిసి నీళ్లలోనే కష్టం మీద బంధువుల ఇంటికి చేరినట్లు తెలిసిందని కీర్తి వెల్లడించింది. అదృష్టవశాత్తూ హాస్పిటల్లో జనరేటర్ కూడా పని చేయక సర్జరీ క్యాన్సిల్ చేశారని.. లేదంటే తన బామ్మ ప్రాణాలు పోయేవని చెప్పింది కీర్తి. ఐసీయూలో ఉన్న 18 మంది ప్రాణాలు పోయింది కీర్తి బామ్మను చేర్చిన ఎంఐఓటీ ఆసుపత్రిలోనే కావడం గమనార్హం.
Tags:    

Similar News