పోసాని కృష్ణమురళికి కీలక పదవి!

Update: 2022-11-03 10:30 GMT
ప్రముఖ నటుడు, కథా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. ఆయనను ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌గా నియమించింది.

కాగా పోసాని 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అసభ్య దూషణలు తీవ్ర కలకలం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు పోసాని ఇంటిపై దాడికి కూడా పాల్పడ్డారు. మరోవైపు తెలుగు సినిమాల్లోనూ పోసాని కృష్ణమురళికి అవకాశాలు తగ్గిపోయాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పోసాని కృష్ణమురళికి పదవి వస్తుందని ఆశించగా ఎట్టకేలకు ఇప్పటికి ఆయనకు పదవి దక్కింది.

వైసీపీ వైపు చూడటానికి టాలీవుడ్‌ నటులు ఇష్టపడటం లేదని.. వారిని జగన్‌ వాడుకుని వదిలేశాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో సినీ రంగానికి చెందిన అలీకి ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు పదవి, పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కడం గమనార్హం.

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు చిరంజీవి, మహేష్‌ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు వైఎస్‌ జగన్‌ను కలవడానికి వచ్చినప్పుడు పోసాని కృష్ణమురళి, అలీలకు సైతం జగన్‌ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వీరిద్దరూ కూడా ప్రముఖ హీరోలతో కలసి సీఎం జగన్‌తో చర్చల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News