`కేజీఎఫ్ -2`కి లాల్ సింగ్ గట్టి పోటీ

Update: 2021-11-18 05:08 GMT
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం `కేజీఎఫ్` కి కొన‌సాగింపుగా `కేజీఎఫ్‌-2` భారీ అంచ‌నాల మ‌ధ్య‌  తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. రిలీజ్ అయిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని అంతకంత‌కు రెట్టింపు చేసింది. ఈ జోడీ మ‌రోసారి పాన్ ఇండియా లెవ‌ల్లో స‌క్సెస్ అందుకోవ‌డం ఖాయంగా టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొవిడ్ స‌హా ఇత‌ర కార‌ణాలతో వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

వేస‌వి సెల‌వులు కూడా సినిమాకి క‌లిసొస్తాయ‌ని  యూనిట్ ఏప్రిల్ కి ఫిక్స్ అయింది. పోటీగా మ‌రో పెద్ద సినిమా కూడా రిలీజ్ లేక‌పోవ‌డంతో ఏప్రిల్ 14 ని లాక్ చేసారు. అయితే స‌రిగ్గా ఇదే నెల‌లో మ‌రో పాన్ ఇండియా స్టార్ అమీర్ ఖాన్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `లాల్ సింగ్ చ‌ద్దా`ని  ఏప్రిల్  లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.  వాస్త‌వానికి  ఈ  చిత్రాన్ని  వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఏప్రిల్ కి వాయిదా వేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

ఆ సినిమా కూడా ఏప్రిల్ 14నే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయ‌ని అంటున్నారు. అయితే తేది మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు. ఒకే నెల‌లో అయినా ఓ ప‌దిహేను రోజులు గ్యాప్ లో రిలీజ్ అయితే రెండు సినిమాల‌కు ఇబ్బంది ఉండ‌దు. థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌దు. లేదంటే `కేజీఎఫ్ -2`కి ఉత్త‌రాదిన పెద్ద దెబ్బ త‌ప్ప‌ద‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. నార్త్ లో అమీర్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేట‌ర్లు మొత్తం ముందే బ్లాక్ అయిపోతాయి. మ‌రో సినిమా రిలీజ్ కు థియేట‌ర్లే దొర‌క‌ని ప‌రిస్థితి ఉంటుంది. ఒక‌వేళ `లాల్ సింగ్ చ‌ద్దా` 14న డిసైడ్ అయితే `కేజీఎఫ్ -2` వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్  వాయిదా త‌ప్ప‌ద‌నే సంకేతాలు అందుతున్నాయి. అలాగే లాల్ సింగ్ చ‌ద్దాలో ఓ కీల‌క పాత్ర‌లో అక్కినేని నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ విష‌యంలో అమీర్- నాగ్-చైత‌న్య తో కేజీఎఫ్ టీమ్ సంప్ర‌దింపులు సాగిస్తుందేమో చూడాలి!
Tags:    

Similar News