'ఖిలాడి' డౌటే .. రామారావు మాత్రం రెడీ!

Update: 2021-12-10 10:32 GMT
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో, రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రలో అర్జున్ కనిపించనున్నాడు. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను, ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. రవితేజ కూడా ఆ తరువాత సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు.

దాంతో అంతా కూడా 'ఖిలాడి' షూటింగు పూర్తయిపోయిందని అనుకున్నారు. రిలీజ్ డేట్ కోసం కాచుకుని ఉందని భావించారు. కానీ చివరి షెడ్యూల్ ఒకటి ఇంకా మిగిలే ఉందనేది తాజా సమాచారం.

ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ను ఫారిన్ లో చిత్రీకరించవకలసి ఉందట. ప్రస్తుతం అక్కడికి వెళ్లి షూటింగులు పెట్టుకునే పరిస్థితులు లేవు. అలా అని ఇక్కడే లాగించేసే అవకాశం లేదు. ఎందుకంటే కథ అలాంటిది. అందువలన ఈ సినిమా టీమ్ ఆలోచనలో పడినట్టుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేనని చెప్పుకుంటున్నారు.

అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనే విషయంపై అధికారికంగా క్లారిటీ రావలసి ఉంది. ఇక 'రామారావు ఆన్ డ్యూటీ' మాత్రం, ముందుగా చెప్పినట్టుగానే మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో దర్శకుడిగా శరత్ మండవ పరిచయమవుతున్నాడు.

రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ కనువిందుచేయనున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతోనే సీనియర్ హీరో తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా రవితేజ 'ధమాకా' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా కూడా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఆ తరువాత 'టైగర్ నాగేశ్వరరావు' .. 'రావణాసుర' ప్రాజెక్టుల నుంచి ఎనౌన్స్ మెంట్లు వచ్చాయి.

ఇలా వరుస సినిమాలతో రవితేజ తన దూకుడు చూపుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉండగా, మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ లోగా ఆయన ఇంకెన్ని ప్రాజెక్టులను లైన్లో పెడతాడో ఏమో!
Tags:    

Similar News