పవన్‌ మీద గౌరవం పది రెట్లు పెరిగిందట!

Update: 2015-07-07 11:30 GMT
నిన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌ మీట్‌ మీద రాజకీయ వర్గాల్లో భిన్నమైన స్పందన వస్తోంది. చంద్రబాబు, కేసీఆర్‌లను తిట్టినట్లే కనిపించారు. అదే సమయంలో కొంచెం పాజిటివ్‌గానూ మాట్లాడారు. దీంతో పవన్‌ను ఎవరూ గట్టిగా సమర్థించనూ లేరు, తిట్టనూ లేరు. చాలామందికి పవన్‌ విషయంలో ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు. రాజకీయ వర్గాల సంగతిలా ఉంటే.. గతంలో పవన్‌ ఏం మాట్లాడినా.. వెంటనే రెస్పాండ్‌ అయ్యే సినిమా వాళ్లు కూడా ఈసారి సైలెంటుగా ఉన్నారు. ఐతే ఒక్క కోన వెంకట్‌ మాత్రం పవన్‌ ప్రెస్‌ మీట్‌ మీద తన అభిప్రాయాలు ట్విట్టర్లో వెల్లడించాడు. ఈ ప్రెస్‌ మీట్‌ చూశాక పవన్‌ మీద తనకున్న గౌరవం పది రెట్లు పెరిగిందంటూ తన అభిమాన కథానాయకుడిని ఆకాశానికెత్తేశాడు కోన.

''ఇలాంటి క్లారిటీ, దూరదృష్టి, దేశం పట్ల పట్టింపు ఎంతమంది రాజకీయ నాయకులకు ఉంటుందో చెప్పండి. పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌ మీట్‌ చూశాక ఆయన మీద నాకున్న ప్రేమ, గౌరవం పది రెట్లు పెరిగింది. నేను రాజకీయం చేసేవాళ్లకు, నాయకులకు మధ్య తేడా చూశాను. పార్టీల ద్వారా రాజకీయ నాయకులు వస్తారు. కానీ నిజమైన నాయకుడు జనం నుంచి వస్తాడు. పవన్‌ కళ్యాణ్‌ నిజమైన నాయకుడు'' అని ట్వీట్‌ చేశాడు కోన. ఈ స్టార్‌ రైటర్‌ సంగతలా ఉంచితే.. పవన్‌ కళ్యాణ్‌ విషయంలో విచిత్రమైన ట్వీట్లు చేసే రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈసారి సైలెంటుగా ఉన్నాడు. ఐతే ఈ ప్రెస్‌ మీట్‌ గురించి తన ట్వీట్లలో ప్రస్తావనే తేకుండా ఉంటే సరే. ''ఇప్పుడే పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌ మీట్‌ వీడియో మొత్తం చూశా'' అనేసి ఊరుకున్నాడు. అంతకుమించి తన అభిప్రాయమేదీ వెల్లడించలేదు. రెస్పాండవడానికి కొంచెం టైం తీసుకుని.. వరుసగా ట్వీట్లు గుప్పిస్తాడో ఏంటో!

Tags:    

Similar News