అది నాది - అందుకే వివాదం వద్దనుకున్న

Update: 2019-01-13 10:12 GMT
బాలీవుడ్‌ లో రూపొందిన 'మణికర్ణిక' చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు క్రిష్‌ మొదట దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం నుండి క్రిష్‌ బయటకు వచ్చిన తర్వాత కంగనా రనౌత్‌ ఆ సినిమాను లీడ్‌ చేసింది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో క్రిష్‌ ఆ సినిమాపై నోరు ఎత్తాడు. ఇన్ని రోజులు సైలెంట్‌ గా ఉన్న దర్శకుడు క్రిష్‌ ఇప్పుడు నోరు తెరిచాడు. మణికర్ణిక చిత్రం తనదే అని, తన సినిమాను వివాదంలో పెట్టడం ఇష్టం లేకే ఇన్ని రోజులు సైలెంట్‌ గా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తాజాగా 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రం విడుదలై సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకున్న నేపథ్యంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్బంగా మణికర్ణిక చిత్రం గురించి స్పందించాడు. మణికర్ణిక చిత్రాన్ని తాను మద్యలో వదిలేయలేదని, షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్‌ చిత్రానికి కమిట్‌ అవ్వడం వల్ల తాను ఆ సినిమా నుండి బయటకు వచ్చాను అన్నాడు. తాను ఎప్పుడైతే మణికర్ణిక చిత్రం నుండి నేను బయటకు వచ్చానో అప్పుడు సినిమాకు మార్పులు చేర్పులు మొదలు పెట్టారు.

మొదట మణికర్ణిక చిత్రంను గత ఏడాది ఏప్రిల్‌ 27న విడుదల చేయాలనుకున్నాం, ఆ తర్వాత ఆగస్టు 15న విడుదల చేయాలని భావించాం. మొత్తం 109 రోజులు షూటింగ్‌ చేశాను. సినిమా నుండి నేను బయటకు రాగానే సోనూసూద్‌ పాత్రను తొలగించి, మళ్లీ రీ షూట్‌ చేశారు. సోనూసూద్‌ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. కాని ఆయన్ను ఎందుకు తొలగించాడో తనకు తెలియదు అన్నాడు. నేను తప్పుకున్న తర్వాత కథను తప్పుదోవ పట్టించేలా వక్రీకరించి చూపించారు.

నేను సినిమా గురించి మొదటనే నోరు తెరవాలని భావించలేదు. ఎందుకంటే అది నా సినిమా, నా సినిమాను వివాదంలో పెట్టడం ఇష్టం లేకే మౌనంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. 'మణికర్ణిక' చిత్రం నాది అంటూ క్రిష్‌ గట్టిగా చెప్తున్నాడు. కంగనా కూడా ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం అంటూ టైటిల్‌ కార్డ్స్‌ లో క్రెడిట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈనెల 25న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News