అలా చ‌నిపోవాల‌నుకున్న‌ రెబ‌ల్ స్టార్

Update: 2022-09-12 13:31 GMT
పుట్టిన ప్ర‌తి మ‌నిషికీ మ‌ర‌ణం త‌ప్ప‌దు. ఐతే కొంద‌రు చావు గురించిన ఊహే లేని స‌మ‌యంలో త‌క్కువ వ‌య‌సులో హ‌ఠాత్తుగా మ‌ర‌ణిస్తారు. కొంద‌రు దీర్ఘ కాలం జీవిస్తారు. ముదిమి వ‌య‌సులోకి వ‌చ్చాక ప్ర‌తి ఒక్క‌రికీ చావు గురించిన ఆలోచ‌న వ‌స్తుంది.

ఆ స‌మ‌యంలో త‌మ మ‌ర‌ణం ఎలా ఉండాలో.. త‌మ ఆఖ‌రి కోరిక ఏంటో ముందే అంద‌రితో పంచుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆదివారం తుది శ్వాస విడిచిన లెజెండ‌రీ యాక్ట‌ర్ కృష్ణంరాజు త‌న మ‌ర‌ణం గురించి 16 ఏళ్ల కింద‌టే ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

తాను మ‌ర‌ణించేట‌పుడు ప‌రిస్థితి ఎలా ఉండాల‌న్న‌ది కూడా ఆయ‌న అప్పుడే చెప్పేశారు. నాగార్జున ఫ‌ర్టిలైజ‌ర్స్ అధినేత కేవీకే రాజుకు, త‌న‌కు మ‌ధ్య మ‌రణం గురించి చ‌ర్చ జ‌రిగిన‌పుడు ఏం మాట్లాడుకున్నామో ఆయ‌న వివ‌రించారు.

"ప్ర‌తి మ‌నిషికీ జీవిత ల‌క్ష్యం ఉండాలంటారు. దీని గురించి రాజు గారికి, నాకు మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. అప్పుడు నా మ‌ర‌ణం ఎలా ఉండాలో ఆయ‌న‌తో పంచుకున్నాను. ప‌చ్చ‌ని చెట్టు నీడ‌లో కూర్చుని నా జీవితంలో నేను ఎవ‌రికీ అన్యాయం చేయ‌లేద‌ని.. గుండెల మీద చేయి వేసుకుని నిర్మ‌ల‌మైన ఆకాశం వైపు చూస్తూ తుది శ్వాస విడ‌వ‌లి.

ఈ రోజు, ఈ రోజు నాకు ఇదే కోరిక" అని రెబ‌ల్ స్టార్ అప్పుడు చెప్పారు. ఐతే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న చెట్టు నీడ‌లో కూర్చుని, ఆకాశం వైపు చూస్తూ తుది శ్వాస విడిచే అవ‌కాశం ద‌క్క‌లేదు. ఎక్కువ మంది లాగే అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూనే ఆయ‌న చ‌నిపోయారు.

గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సైతం అస‌లు ఆసుప‌త్రికి వెళ్ల‌కుండా, ఎలాంటి బాధ అనుభ‌వించ‌కుండా ప్ర‌శాంతంగా చ‌నిపోవాల‌నుకుంటున్న‌ట్లు గ‌తంలో చెప్పారు కానీ.. దానికి భిన్నంగానే తుది శ్వాస విడ‌వాల్సి వ‌చ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News