వ‌ర్కౌట్ అయిన లైలా రీఎంట్రీ.. ఇక త‌గ్గేదే లే!

Update: 2022-11-02 23:30 GMT
అలనాటి అందాల తార, సొట్ట బుగ్గల సుందరి లైలా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 'దుష్మన్ దునియాకా' అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. 'ఎగిరే పావురమా' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అందాల భామ.‌. ఆ తర్వాత తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, ఉర్దూ, కన్నడ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసింది.

తనదైన టాలెంట్ తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొంది ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే యూత్ కు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. అయితే కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో లైలా ఇరానీ వ్యాపారవేత్త మెహదిన్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

వివాహం తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ముంబై వెళ్ళిపోయి అక్కడ స్థిరపడింది. లైలా కు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అయితే సినీ ఇండస్ట్రీకి దూరమైన పదహారేళ్ల తర్వాత మళ్లీ లైలా ఇటీవల 'సర్దార్' మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ స్టార్ కార్తీ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా న‌టించారు.

ఇందులో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభిన‌యం చేశాడు. అక్టోబర్ 21న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. టాక్‌ అనుకూలంగా ఉండటంతో ఈ సినిమా త‌మిళ, తెలుగు భాష‌ల్లో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ దుమ్ము దులిపేస్తోంది.

ఇక ఈ చిత్రంలో లైలా సర్దార్ ఆశయం కోసం పోరాడే సమీరా థామస్ అనే జర్నలిస్ట్ పాత్రలో పదేళ్ల పిల్లాడికి తల్లిగా నటించింది. సమీరా పాత్రలో డీసెంట్గా యాక్ట్‌ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే అప్పట్లో ఎంత అందంగా కనిపించేదో ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తూ అందరి మనసుల‌ను దోచేసింది.

ఈ చిత్రంలో లైలా పాత్ర ఉన్నది కాసేపే అయినా.. త‌నదైన న‌ట‌న‌తో విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. లైలా రీఎంట్రీ బాగానే వ‌ర్కౌట్  అవ్వడంతో ఈ అమ్మడుకు సౌత్ లో వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ప్రస్తుతం లైలా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల‌ను ఎంచుకునే పనిలో పడింద‌ని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రీ ఎంట్రీలో లైలా తగ్గేదే లే అంటూ దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News