RC15 ఆల్బ‌మ్ తో భారీ విజువ‌ల్ ఫీస్ట్ ప్లాన్ చేసిన శంక‌ర్

Update: 2022-11-27 05:30 GMT
భారీగా సెట్లు వేసి అద్భుత‌మైన‌ క‌ళాత్మ‌క‌త‌ను జోడించి పాట‌ల్ని చిత్రీక‌రించ‌డంలో సంజ‌య్ లీలా భ‌న్సాలీకి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. కానీ అందుకు భిన్నంగా ప్ర‌పంచంలోని ఏడు వింత‌ల‌తో పాటు ఇత‌ర అద్భుత లొకేష‌న్ల‌ను సెర్చ్ చేసి విజువ‌ల్ వండ‌ర్స్ అనిపించే పాట‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో శంక‌ర్ సిద్ధ‌హ‌స్తుడు. అత‌డి సినిమాల్లో భారీ సెట్ లోను ఒక పాట త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ సెట్ల‌ కే జేజ‌మ్మ‌లాంటి సెట్ల‌ను ప్రిపేర్ చేయిస్తాడు శంక‌ర్. అలాంటి విజువ‌ల్ రిచ్ పాట‌ల‌ను వేరొక ద‌ర్శ‌కుడు ఎవ‌రూ తెరకెక్కించ‌లేరంటే అతిశ‌యోక్తి కాదు. శంక‌ర్ తొలి చిత్రం `జెంటిల్ మేన్` నుంచి రోబో- 2.0 వ‌ర‌కూ అత‌డిది అదే శైలి.

అందుకే శంక‌ర్ కి ఇండియా లెవ‌ల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు జంటిల్ మేన్ - ఒకే ఒక్క‌డుని మించి మ‌రో లెవ‌ల్ అనిపించే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో మెగా ఫ్యాన్స్ లో పూన‌కాలు ఒక రేంజులో బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఇప్పుడు చెర్రీ కోసం శంక‌ర్ ఏం ప్లాన్ చేసాడో తెలిస్తే ఆ పూన‌కాలు మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేస్తాయి. రామ్ చరణ్ - కియారా అద్వానీ జంట‌తో పాటు భారీగా జూనియ‌ర్ డ్యాన్సర్లు ఆర్టిస్టుల‌తో శంక‌ర్ ఒక అద్భుత‌మైన పాట‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది.

 యూనిట్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో పాట చిత్రీకర‌ణ‌లో బిజీగా ఉంది. ఈ పాటలో అదిరిపోయే విజువల్స్ క‌ట్టి ప‌డేస్తాయ‌ని స‌మాచారం. అవుట్ పుట్ లో అత్యుత్తమంగా ఏ క్లాస్ సినిమాటోగ్రఫీ పరికరాలను ఉపయోగిస్తూ విజువ‌ల్స్ ప‌రంగా శంక‌ర్ త‌న‌దైన శైలిలో మ్యాజిక్ చేయ‌బోతున్నార‌ట‌. న్యూజిలాండ్ లోని స్ట‌న్నింగ్ అనిపించే సుందరమైన ప్రదేశాలు తెరపై ఆవిష్క‌రిస్తున్నారు. ఈ లొకేష‌న్స్ డీడీఎల్ జే- స్విట్జ‌ర్లాండ్ లొకేష‌న్ల‌ను మించి ఆక‌ర్షిస్తాయ‌ని చెబుతున్నారు.

మొత్తానికి ఇప్పుడు చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ట్రీటిస్తుందో వేచి చూడాలి. రామ్ చ‌ర‌ణ్ లాంటి ఎన‌ర్జిటిక్ డ్యాన్స‌ర్... ట్య‌లెంటెడ్ న‌టుడు శంక‌ర్ చేతికి చిక్కాక అత‌డి నుంచి న‌వ‌రసాల్ని ఏ రేంజులో పిండేస్తాడో ఊహించ‌వ‌చ్చు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ ఐఏఎస్ ట‌ర్న్ డ్ సీఎం గా క‌నిపిస్తార‌ని కూడా ముచ్చ‌ట వినిపిస్తోంది.  

 రామ్ చ‌ర‌ణ్ ని ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లోను శంక‌ర్ చూపించ‌నున్నారు. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌తోను చ‌ర‌ణ్ స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇస్తాడ‌ని కూడా ఒక సెక్ష‌న్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఆర్.సి 15 మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. దీనిని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News