అయ్యో .. సుకుమార్ పట్టు నాకు రాలేదే: విజయేంద్రప్రసాద్!

Update: 2022-03-28 10:30 GMT
సినిమా కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి ఎంతో అనుభవం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ ఫీల్డ్ లో ఉన్నారు. రాజమౌళి సినిమాలకు ఆయనే కథలను అందిస్తూ ఉంటారు. ఒక కథపై ఆయన రాజమౌళితో కలిసి చేసే కసరత్తు మామూలుగా ఉండదు. అందువల్లనే ఆ కథలు భారీ వసూళ్లతో పాటు ప్రశంసలను అందుకుంటున్నాయి. 'బాహుబలి' తరువాత ఆయన అందించిన కథతోనే రీసెంట్ గా 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు అనేక సంగతులను అభిమానులతో విజయేంద్ర  ప్రసాద్  పంచుకున్నారు. "తెలుగులో ఈ మధ్య  కాలంలో రీమేకులు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. మన సినిమాలు కూడా ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి కదా. మన కథలు వేరే చోటికి వెళితే ఆనందించడం ఓకే. కానీ వాళ్ల కథలను మనం కొంటున్నందుకు  ఏడవకూడదు. ఇది ఒక బిజినెస్ .. డబ్బు పెట్టేవారు హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడానికి ఇష్టపడతారు. అలా చేయడం వలన తమకి ఒక క్లారిటీ ఉంటుంది కనుక ఆసక్తిని చూపుతారు .. అందులో తప్పేం ఉంది?

రచన విషయానికి వస్తే పూరి జగన్నాథ్   ఒక రచయితగా నాకు బాగా నచ్చుతాడు. అలాగే త్రివిక్రమ్ పంచ్ లు కూడా నాకు చాలా ఇష్టం. సుకుమార్ గారు కథ చెప్పే విధానం కొత్తగా ఉంటుంది .. ఆయన  అంటే కూడా నాకు చాలా గౌరవం ఉంది.

ఒకరు చేసిన అన్ని సినిమాలు గొప్పగా ఉండాలని లేదు. ఏ సినిమాకి ఆ సినిమాగా చూడవలసిందే. తెలుగులో సినిమా రచయితలందరూ ఇప్పుడు దర్శకులైపోయారు. ఎవరికి వారు తమ సినిమాలకు తామే రాసుకుని తీసుకుంటున్నారు. అందువలన రచన - దర్శకత్వం అనే ఈ రెండింటినీ సెపరేటుగా చూడలేకపోతున్నాము.

ఈ మధ్య  వచ్చిన 'పుష్ప' సినిమా చూస్తూ నేను షాక్ అయ్యాను. పూరి జగన్నాథ్ రచనలో కనిపించే ఒక విశృంఖలత్వం నేను మళ్లీ సుకుమార్ లో చూశాను. ఈ పట్టు మనకి రాదే .. అనిపించింది. ఏం చేయాలి? .. ఏం చేయాలి? అనుకున్నాను.

ఒక ప్రేక్షకుడి గా నేను అతణ్ణి అభినందిస్తాను .. కానీ ఒక రచయితగా అభద్రతా భావం కలుగుతుంది. ఇక రాజమౌళి విషయానికి వస్తే  తను ఈ స్థాయికి వెళతాడని నేను అనుకోలేదు. అందుకు  కారణం ఆయన కృషి .. ఆ భగవంతుడి దయ. ఒక సినిమా పూర్తయ్యేంత వరకూ రెండో సినిమాను గురించి పొరపాటున కూడా తను ఆలోచించడు.   తన అంకితభావమే తన సక్సెస్ కి కారణమని నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News