తెలంగాణ‌లో టిక్కెట్ ధ‌ర‌ల‌పై మ‌ళ్లీ లొల్లి!

Update: 2022-03-08 09:40 GMT
తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం చిత్ర ప‌రిశ్ర‌మ‌కి అనుకూలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే వెలుసుబాటు కూడా క‌ల్పించింది. దీంతో పాటు ఐద‌వ షోకి అనుమ‌తిచ్చింది. ఈ రెండు వ‌రాల‌తో ప‌రిశ్ర‌మ పెద్ద‌లు సంతోషంగా వ్య‌క్తం చేసారు.  పంపిణీదారులు..బ‌య్య‌ర్లు..ఎగ్జిబిట‌ర్లు అంతా త‌మ‌కి అనుకూలంగానే ఉంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. మల్టీప్లెక్స్ ల్లో టిక్కెట్ ధ‌ర 150 నుంచి 350 ధ‌ర వ‌ర‌కూ ఉంది. సింగిల్ స్ర్కీన్ కి 200 ధ‌ర నిర్ణ‌యించారు.

ఇక హైద‌రాబాద్ మ‌ల్టీప్లెక్స్ లో సాధార‌ణ టిక్కెట్ ధ‌ర 295 రూపాయ‌లు కాగా ..రిక్లైన‌ర్ టిక్కెట్ ధ‌ర 350 రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. అయితే ఈ ధ‌ర మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రేక్ష‌కుల‌కు- ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి చాలా ఎక్కువ‌నే చెప్పాలి. దీంతో  రాష్ర్టంలో టిక్కెట్ ధ‌ర‌ల పెంపుపై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇదే కొన‌సాగితే  థియేట‌ర్ కి వ‌చ్చే  ఆడియ‌న్స్  త‌గ్గిపోతారని..సినిమా మ‌నుగ‌డే ప్ర‌శ్నార్ధకం అవుతుంద‌ని సీరియ‌స్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది.

రాష్ర్టంలో టిక్కెట్ ధ‌ర‌లు ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసాయి. దీంతో పంపిణీదారులు కొత్త ప్ర‌పోజ‌ల్స్ తీసుకొస్తున్నారు. పెద్ద సినిమాల‌కు  వారం రోజుల్లో  ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ఓ అగ్ర నిర్మాత‌..డిస్ర్టిబ్యూట‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. భారీ బ‌డ్జెట్ చిత్రాలు యాధావిధిగా అధిక ధ‌ర‌ల‌కు టికెట్లు  విక్ర‌యించ‌వ‌చ్చు. అయితే వారం గ‌డిచిన త‌ర్వాత ధ‌ర‌లు త‌గ్గించాలి.  మ‌ద్య‌స్థ‌..లో బడ్జెట్ చిత్రాల‌కు అధిక టిక్కెట్ ధ‌ర‌ల నుంచి మిన‌హాయింపు  ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఇప్ప‌టికే ఓటీటీకి బాగా అల‌వాటు ప‌డ్డార‌ని...థియేట‌ర్ లో సినిమా చూడ‌టానికి ఇష్టం చూపించ‌డం లేదని ఇదే కొన‌సాగితే థియేట‌ర్ పుట్ ఫాల్స్ పై ఓటీటీ ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంటంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఈ విష‌యంలో నిర్మాత‌లు..డిస్ర్టిబ్యూట‌ర్లు.. పున‌రాలొచిస్తే భారీగా పెరిగిన టిక్కెట్ ధ‌ర‌ల నుంచి మిన‌హాయింపు ఇవ్వొచ్చు అన్న‌ అభిప్రాయాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. టిక్కెట్ ధ‌ర‌ల అంశాన్ని మొద‌ట తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ గానే తీసుకుంది.

అధిక ధ‌ర‌ల‌కు టిక్కెట్లు విక్ర‌యించ‌డానికి వీలు లేదని ఉత్త‌ర్వులు ఇచ్చింది. కానీ ఇదే అశంపై  హైకోర్టులో పిల్ దాఖ‌లవ్వ‌డం ప‌రిశ్ర‌మ‌కి అనుకూలంగా తీర్పు రావ‌డంతో ప్ర‌భుత్వం దిగొచ్చి ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. కానీ ఇప్పుడిలా ఇష్టానుసారం ధ‌ర‌లు పెంచేసి ప్రేక్ష‌కుడి ముక్కు పిండి వ‌సూల్ చేస్తున్నారు. మ‌రో వైపు  డే బై డే ఓటీటీకి ఆద‌ర‌ణ పెర‌గ‌డం..త‌క్కువ ధ‌ర‌కే సినిమా చూసే వెసులుబాటు దొర‌క‌డం వంటి అంశాలు థియేట‌ర్ మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నిస్తున్నాయి.

ఈ విష‌యంలో ప‌రిశ్ర‌మ పెద్ద‌లు- డిస్ర్టిబ్యూట‌ర్లే అంతిమ నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌న్న అభిప్రాయాలు తెరపైకి వ‌స్తున్నాయి. పెరిగిన ధ‌ర‌లపై సినీ ప్రియుల‌కు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అంతంత ధ‌ర తో టిక్కెట్ కొని థియేట‌ర్లో సినిమా చూడటం భారం అవుతుంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజాగా  తెర‌పైకి వ‌స్తోన్న కార‌ణాలు చూస్తుంటే క‌డుపు నిండితే ఒక‌లా..క‌డుపు కాలితో మ‌రోలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News