అరవింద రాఘవుడి ట్విస్టుల లీకులు?

Update: 2018-10-08 11:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ విడుదలకు కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి మారుతోంది. అభిమానులు ఇప్పటికే తమ ఉత్సుకతను అణుచుకోలేకపోతున్నారు.  జై లవకుశ వచ్చి ఏడాది అవుతోంది. ఈ కారణంతో పాటు త్రివిక్రమ్ తో తారక్ డ్రీమ్ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూపులు ఉన్నాయి కాబట్టి మామూలుగానే ఆకాశాన్ని అంటే అంచనాలు ఇప్పుడు దాన్ని దాటిపోయి ఇంకాస్త ఎగబాకుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన లీకులు ట్విస్టులు ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి.

వాటి ప్రకారం గతంలో లీక్ అయిన నాగబాబు తారక్ ల మీద ఎటాక్ సీన్ ప్రారంభంలో వస్తుంది. అందులో ప్రత్యర్థి జగపతి బాబుని చంపాక చదువు కోసం సిటీకి వెళ్ళిపోతాడట తారక్. తొలిచూపులోనే ప్రేమించిన అరవింద ద్వారా జగపతి బాబు బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న రాఘవ మళ్ళి ఊరికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబాలు ఇంకా ఫ్యాక్షన్ కోరల్లోనే బలవుతున్నాయని అర్థమవుతుంది. దీంతో మళ్ళి కత్తి పట్టక తప్పకపోవడంతో తిరిగి శత్రుసంహారం మొదలుపెట్టి సీమలో శాంతి నెలకొల్పేందుకు ఏం చేశాడా అనేదే కథగా ప్రచారం చేస్తున్నారు.

ఇది నిజమో కాదో కానీ వైరల్ మాత్రం అయిపోతోంది. ఈ మాత్రం ఉన్నా చాలు యంగ్ టైగర్ విశ్వరూపం చూడొచ్చని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే తారక్ గతంలో చేసిన ఫ్యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఇందులో రక్తపాతం కన్నా ఎమోషన్ కే పెద్ద పీఠ వేసినట్టు చెబుతున్నారు. నాన్న దూరమైన సీమ బిడ్డగా తన కష్టం ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశంతో వీర రాఘవ రెడ్డి ఏం చేసాడు అనే పాయింట్ ని త్రివిక్రమ్ తనదైన శైలిలో డీల్ చేసినట్టు వినికిడి.

గురువారం విడుదల కోసం ఇప్పటికే థియేటర్లు సిద్ధమయ్యాయి. కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టేసారు. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. లాంగ్ వీక్ ఎండ్ కాబట్టి నాలుగు రోజులు వసూళ్ల పరంగా రికార్డులు ఖాయమని నమ్మకంగా ఉన్నారు అభిమానులు. అయినా ఇలా కథను విశ్లేషించడం ఏమో కానీ అభిమానులు ఇంకో రెండున్నర రోజులు ఆగితే సస్పెన్స్ మొత్తం వీగిపోతుంది.
Tags:    

Similar News