రాజశేఖర్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ చిత్రం ‘మగాడు’లో హీరోయిన్ గా నటించిన అలనాటి అందాల తార లిజి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సుమన్ తో కలిసి ‘20వ శతాబ్దం’లో నటించిన లిజి తన కెరీర్ లో చేసిన 8 తెలుగు చిత్రాలలో 6 సూపర్ హిట్ అయ్యాయి. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉండగానే ఆమె....దర్శకుడు ప్రియదర్శన్ ను వివాహం చేసుకుని నటనకు స్వస్తి చెప్పింది. తాజాగా, అలనాటి అందాలతార మరోసారి తెరపై తళుక్కుమనబోతోంది. దాదాపు పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లిజి ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా లిజి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. నితిన్ - మేఘా ఆకాశ్ లు జంటగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దర్శకుడు త్రివిక్రమ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో లిజీ ఓ కీలక పాత్రలో నటించబోతోంది. ఈ విషయాన్ని లిజీ తర ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానా లేదా అని చాలా మంది అడుగుతున్నారని, 25 ఏళ్ల తర్వాత న్యూయార్క్లో జరుగుతున్న చిత్రీకరణలో కెమెరా ముందుకు వచ్చానని చెప్పారు. భయంగా అనిపించినా థ్రిల్లింగ్ గా ఉందని, ఈ అనుభవాన్ని మిస్ అయ్యాన చెప్పారు. టాలీవుడ్ ను వదిలి వెళ్లినందుకు చాలా బాధపడ్డానని, ఆ సమయంలో నాకు వేరే అవకాశం దొరకలేదని చెప్పారు. చిత్రబృందం తనకు చాలా సపోర్ట్ చేసిందని అన్నారు. తనకు ఎక్కువగా అవకాశాలు వచ్చిన మలయాళం చిత్రాల్లోనూ నటిస్తానన్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో నటించబోతున్నానని చెప్పారు. మంచి అవకాశాలు వస్తున్న సమయంలో చిత్ర పరిశ్రమను వదులుకోవడం పొరపాటని, సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నానని అన్నారు.