ఇండియన్-2.. కాంప్రమైజ్ అయిపోయారు

Update: 2019-02-20 11:37 GMT
తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ తో సినిమా అంటే మామూలు వ్యవహారం కాదు. అతడి సినిమాల బడ్జెట్ - స్పాన్ మామూలుగా ఉండవు. ఐతే గతంలో శంకర్ ఎంత ఖర్చు పెట్టినా అది సినిమాకు అవసరమే అనిపించేది. ప్రతి రూపాయీ తెరపై కనిపించేది. సద్వినియోగం అయ్యేది. కానీ ఈ మధ్య శంకర్ అదుపు తప్పుతున్నాడు. అనవసర ఖర్చు పెంచేస్తున్నాడు. కంటెంట్ పరంగా వీక్ అయిపోతున్నాడు. ‘ఐ’.. ‘2.0’ సినిమాల విషయంలో అదే జరిగింది. దీంతో ‘ఇండియన్-2’ విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు.. బడ్జెట్ విషయంలో శంకర్‌ కు లిమిటేషన్లు పెట్టినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో శంకర్ హర్టయ్యాాడని.. వేరే నిర్మాతల కోసం ప్రయత్నం చేస్తున్నాడని.. సినిమా తాత్కాలికంగా ఆగిందని కూడా గుసగుసలు వినిపించాయి. ఈ ప్రాజెక్టుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ వార్త ఒకట్రెండు రోజుల్లోనే బాగా వైరల్ అయింది.

దీంతో చిత్ర నిర్మాణ సంస్థ వెంటనే స్పందించింది. ‘ఇండియన్-2’ ఆగిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని.. ఈ సినిమా చిత్రీకరణ షెడ్యూల్ ప్రకారం సాగుతుందని లైకా వాళ్లు ప్రకటించారు. ఇప్పటికే రెండు చిన్న షెడ్యూళ్లు పూర్తయ్యాయని.. త్వరలోనే మూడో షెడ్యూల్ మొదలవుతుందని.. అందుకోసం ప్రస్తుతం సెట్స్ నిర్మాణం జరుగుతోందని చెప్పింది. బడ్జెట్ సమస్యల గురించి - శంకర్‌ తో గొడవ గురించి ఆ సంస్థ ఏమీ స్పందించలేదు. సినిమాల ప్రొడక్షన్‌ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఆ సంస్థకు వేల కోట్లలో వేేరే వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి సంస్థ బడ్జెట్ సమస్యలతో ఒక సినిమా ఆపేసిందంటే వారికది అవమానమే. ‘2.0’కు నష్టం వచ్చినప్పటికీ.. ‘ఇండియన్-2’ విషయంలో షరతులు పెట్టి సినిమా వేరే సంస్థకు వెళ్లిపోతే తమ స్థాయి అది బాగోదని సంస్థ అధినేతలు శంకర్‌ తో కాంప్రమైజ్ అయినట్లు సమాచారం. అతను అనుకున్న బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేయనున్నారట.


Tags:    

Similar News