పాట రాయడం అంత తేలిక కాదు: చంద్రబోస్

Update: 2022-01-30 10:48 GMT
తెలుగు పాటకు తేనె అద్దిన రచయిత చంద్రబోస్ .. అక్షరాల దాహాన్ని అమృతంతో తీర్చిన రచయిత ఆయన. ఆయన కాలానికి యూత్ పల్స్ తెలుసు .. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు తెలుసు .. మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం తెలుసు. 'మంచుకొండల్లోన చంద్రమా' అంటూ తెలుగు పాటను పలకరించిన చంద్రబోస్, అప్పటి నుంచి కాలంతో పాటే తన కలాన్ని పరుగులు తీయిస్తూ వెళుతున్నారు. తెలుగు .. ఆంగ్ల పదాలను మిక్స్ చేస్తూ పదప్రయోగాలు చేయడంలోనూ, యాస పట్టుకుని పాటను పరుగులు తీయించడంలోను ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవల 'పుష్ప' పాటకి ఆయన రాసిన పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి.

తాజా ఇంటర్వ్యూలో చంద్రబోస్ మాట్లాడుతూ .. "తెలుగు పాటను పరిశీలిస్తే అది స్థానికత చుట్టూనే తిరుగుతూ కనిపిస్తుంది. సాధ్యమైనంతవరకూ కవులలో చాలామంది వాడుక భాషలోనే పాటలు రాశారు. అదే పద్ధతిని నేను  అనుసరిస్తున్నాను. పాట అనేది సామాన్య ప్రేక్షకుడికి చేరాలంటే వాడుక భాషను వాడవలసిందే. పాట ప్రయోజనం కూడా అన్ని తరగతుల ప్రేక్షకులకు అర్థం కావడమే. ఈ మధ్య కాలంలో పాటల్లో స్థానికతకు మరింత ప్రాధాన్యత పెరుగుతూ వెళుతోంది. అందువల్లనే 'రంగస్థలం'లో గోదావరి యాస .. 'పుష్ప'లో చిత్తూరు జిల్లా యాసలో పాటలు రాయవలసి వచ్చింది.

నిజానికి పాట రాయడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. 'రంగస్థలం' .. 'పుష్ప' సినిమా కథలు .. పాత్రలు యాస నేపథ్యంలోనే నడుస్తాయి. అందువలన పాటలు కూడా యాసతో రాయవలసిందే. ఆ పాటల సమయంలో సుకుమార్ - దేవిశ్రీతో నేను ఒక రచయితగా కాకుండా, ఒక స్నేహితుడిగా ప్రయాణించాను. అందుకే ఆ పాటలు అంత బాగా వచ్చాయని నేను భావిస్తున్నాను. సాధారణంగా ఒక పాట ద్వారా  చెప్పాలనుకున్న భావం ఒకటే ఉంటుంది. ఆ పాటలో కొన్ని పాదాలను చేర్చడం వలన అది యాసగా మారిపోతూ ఉంటుంది. రచయితకి ఆ ఒడుపు తెలియాలంతే .. అది తెలియాలంటే పదాల సముదాయం తెలిసి ఉండాలి.  

నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను .. ఆయా కవుల రచనా శైలిని ఎక్కువగా పరిశీలన చేస్తుంటాను. ఆయా ప్రాంతాల్లోని మాండలికాలను .. ఆ పదాల వెనుకగల అర్థాలను .. భావజాలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇదంతా నిరంతరం జరిగే అన్వేషణ .. అనునిత్యం నేను చేసే తపస్సు. అందువల్లనే ఏ యాసలో పాట రాయాలన్నా ఇదే పద్ధతిలో నేను పరిశోధన చేస్తూ ముందుకు వెళతాను. కళ అంతిమ లక్ష్యం స్థానికతను విశ్వ వేదికపై నిలపడం. ఈ విషయంలో 'విశ్వనరుడిని నేను' అనే జాషువా పద్ధతిని నేను ఫాలోఅవుతుంటాను. మధురాంతకం రాజారామ్ గారి సాహిత్యం కూడా నాపై ఎంతో ప్రభావం చూపింది. ఆయన రచనలను చదువుతున్నట్టుగా అనిపించదు .. జీవితాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.  
Tags:    

Similar News