MAA బిల్డింగ్: ఇది విన్నారా అధ్య‌క్షా మంచు విష్ణు?

Update: 2023-04-10 11:04 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘా(మా)నికి ఇది పెను స‌వాల్. దాదాపు 90 ఏళ్ల చ‌రిత్ర ఉన్న టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం ఏకంగా 50 ఏళ్లు పైగా మ‌నుగ‌డ సాగించింది. కానీ ఇప్ప‌టికీ సొంత భ‌వంతిని ఏర్పాటు చేసుకోలేని ధైన్యంలో ఉండిపోవ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుత మా అధ్య‌క్షుడు మంచు విష్ణు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంతో దూకుడుగా సొంత భ‌వంతిని నిర్మించి తీరుతామ‌ని స్థ‌ల సేక‌ర‌ణ చేశామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి సంబంధించిన పునాది రాయి అయినా ప‌డ‌ని ధైన్యం నెల‌కొంది.

ఇంత‌లోనే మూవీ ఆర్టిస్టు సంఘం (మా)కు పెద్ద స‌వాల్ ఎదురైంది. మూవీ ఆర్టిస్టుల సంఘంలో చేరేందుకు డబ్బు చెల్లించ‌లేని పేద ఆర్టిస్టులు క్యారెక్ట‌ర్ న‌టులు స‌హా చాలా మంది తార‌లు టీఎంటీఏయు స‌భ్యులుగా మారుతున్నారు. తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు) ఇటీవ‌లి కాలంలో మూవీ ఆర్టిస్టుల సంఘంతో పోటీప‌డుతూ త‌న బ‌లాన్ని అమాంతం పెంచుకుంటోంది.

ఇందులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు స‌హా సీనియ‌ర్లు.. స్టేజీ ఆర్టిస్టులు.. అప్ కం ఆర్టిస్టుల‌తో ఇప్ప‌టికే 1000 పైగా మెంబ‌ర్ షిప్ ల‌తో అత్యంత పెద్ద అసోసియేష‌న్ గా అవ‌త‌రించ‌గా ప్ర‌స్తుత వార్షికోత్స‌వానికి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ని దిగ్విజ‌యంగా నిర్వ‌హించింది. ఏడెనిమిదేళ్ల క్రితం చిన్న‌గా ప్రారంభ‌మైన ఈ అసోసియేష‌న్ దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మానంగా ఎదిగేయ‌డంపై అసోసియేష‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

తాజాగా మోతిన‌గ‌ర్ లోని ఒక ప్ర‌యివేట్ వెన్యూలో జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో టీఎంటీఏయు అధ్య‌క్షకార్య‌ద‌ర్శులు మాట్లాడుతూ.. తాము త్వ‌ర‌లోనే సొంత బిల్డింగ్ ఏర్పాటు కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఇందులో భాగంగా స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ఇప్ప‌టికే కొంత నిధిని స‌మ‌కూర్చుకున్నామ‌ని తెలిపారు. అంతేకాదు.. త‌మ‌కు స‌హ‌క‌రించేందుకు ప‌లువురు నాయ‌కులు.. విద్యాధికులు.. పారిశ్రామిక వేత్త‌లు ముందుకు వ‌చ్చార‌ని కూడా వెల్ల‌డించారు. చూస్తుంటే మూవీ ఆర్టిస్టుల సంఘం కంటే ముందే భూమి పూజ చేసి ఠెంకాయ కార్య‌క్ర‌మంతో టీఎంటీఏయు స‌వాల్ విసిరేట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ అసోసియేష‌న్ కి భారీగా నిధులు స‌మ‌కూర‌డంతో అంతా ఉత్సాహంగా ఉన్నారు.

మునుముందు టాలీవుడ్ లో ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఇది ఒక వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌ని.. ఇప్ప‌టికే అప్ కం ఆర్టిస్టులు .. సీనియ‌ర్లు.. వృద్ధ ఆర్టిస్టుల‌కు తాము అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని.. ఎవ‌రైనా ఆర్టిస్టు ఆడిష‌న్ లు జ‌రిగే స్థ‌లాలు స‌హా ఏ సంస్థ నుంచి ఆడిష‌న్ జ‌రుగుతోందో తెలుసుకోవాల‌ని కోరుకునే వారికి టీఎంటీఏయు గ్రూప్ లో స‌ర్వ‌స‌మాచారం అందుతోందని అసోసియేష‌న్ అధ్య‌క్షులు వెల్ల‌డించారు.

కార్య‌క్ర‌మ ముఖ్య అతిథి ..భాజ‌పా జాతీయ మ‌హిళా మోర్చా స‌భ్యురాలు డా.ప‌ద్మ వీర‌ప‌నేని అసోసియేష‌న్ వృద్ధికి త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు సి.ఎస్.సుంద‌ర్.. గౌర‌వ అధ్య‌క్షులు 30 ఇయ‌ర్స్ పృథ్వీ.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ఏ.రాజ‌శేఖ‌ర్.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోవింద శ్రీ‌నివాస్.. క‌మిటీ ఛైర్మ‌న్ నండూరి రాము..ఉపాధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ రాధోడ్..వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మునీంద్ర‌బాబు..కోశాధికారి నూక‌రాజు.. ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ కే.పి.రెడ్డి .. వీరేష్ ... క‌న‌క‌దుర్గ‌మ్మ త‌దిత‌రులు సర్వ‌స‌భ్య స‌మావేశంలో పాల్గొన్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News