నిఖిల్ - నితిన్ ఏం చేస్తారో మరి..!

Update: 2022-08-09 03:47 GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సందడి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్లు.. ఇప్పుడు హౌస్ ఫుల్స్ తో కళకళలాడుతున్నాయి. గడిచిన శుక్రవారం రిలీజైన 'బింబిసార' & 'సీతారామం' సినిమాలు రెండూ హిట్ టాక్ తెచ్చుకుని ఇండస్ట్రీలో ఉత్సాహం తీసుకొచ్చాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ తన ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్‌ ఈవెన్ మార్క్‌ ను చేరుకుంటే.. దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' చిత్రం కూడా మొదటి వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టింది. ఇవి రెండూ మండే టెస్ట్ కూడా పాస్ అయి సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నితిన్ మరియు నిఖిల్ ల మీద పడింది.

నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఆగస్టు 12న విడుదల కానుండగా.. నిఖిల్ సిద్దార్థ్ చేసిన 'కార్తికేయ 2' చిత్రం మరుసటి రోజు 13న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో.. ఈ రెండు సినిమాల చుట్టూ ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది.

పాండమిక్ తర్వాత విజయవంతమైన మాస్ యాక్షన్‌ జోనర్ లో 'మాచర్ల' సినిమా వస్తుంటే.. సూపర్ నేచురల్ మిష్టికల్ థ్రిల్లర్ గా 'కార్తికేయ 2' మూవీ తెరక్కింది. నిఖిల్ సినిమాకు బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రయోజనం అదనంగా ఉంది. ఇప్పుడు 'బింబిసార' 'సీతా రామం' సినిమాలు సక్సెస్ అవ్వడం నితిన్ - నిఖిల్ సినిమాలకి మరింత జోష్ ఇచ్చినట్లు అయింది.

అదే సమయంలో కళ్యాణ్ రామ్ - దుల్కర్ సల్మాన్ చిత్రాల వల్ల థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం కూడా ఉందని టాక్ నడుస్తోంది. 'బింబిసార' 'సీతా రామం' సినిమాలు రెండో వారంలోనూ విజయవంతంగా నడిచి మూడో వారంలో అడుగుపెడితే మాత్రం.. రాబోయే రిలీజులకు కొన్ని థియేటర్లు తగ్గే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. రోజు రోజుకీ వ‌సూళ్లు పెరిగితే.. త‌మ థియేట‌ర్ల‌ని వ‌దులుకోవ‌డానికి ఈ రెండు సినిమాలూ ఇష్ట‌ప‌డకపోవచ్చు.

'మాచర్ల నియోజవర్గం' మూవీ కోసం ఆగస్ట్ 12వ తేదీని ఎప్ప‌డో లాక్ చేసి.. కొన్ని థియేట‌ర్ల‌ను కూడా బ్లాక్ చేసుకున్నారు. అలానే అమీర్ ఖాన్ - నాగచైతన్య కలిసి నటించిన 'లాల్ సింగ్ చ‌ద్దా' చిత్రాన్ని ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన 'కార్తికేయ 2' చిత్రాన్ని ముందుగా ఈ నెల 12నే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే క్లాష్ ని నివారించడానికి ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని థియేటర్లు కూడా బ్లాక్ చేసుకొని పెట్టుకున్నారు.

'కార్తికేయ 2' సినిమా ఫలితంపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. రిలీజ్ అయ్యాక హిట్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా థియేటర్లు పెంచుకోడానికి ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తే ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైనా ఆదరిస్తామని తెలుగు ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. గతంలో అనేక సందర్భాల్లో ఒకే సీజన్ లో వచ్చిన మూడు చిత్రాలు సక్సెస్ అవడాన్ని మనం చూశాం.

ఈ నేపథ్యంలోనే కంటెంట్ బాగుంటే థియేటర్ల సమస్య ఉండదని నిఖిల్ అండ్ టీమ్ ధీమాగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ విజువ‌ల్ ఫీస్ట్ గా.. థ్రిల్లింగ్ గా అనిపించింది.. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మరోవైపు 'మాచర్ల' మాస్ ని ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి నిఖిల్ - నితిన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమై ఇండస్ట్రీలో పాజిటివిటీని కొనసాగిస్తాయేమో చూడాలి.
Tags:    

Similar News