జాతీయ అవార్డులు అందుకున్న‌ మ‌హ‌ర్షి -జెర్సీ!

Update: 2021-10-25 07:56 GMT
అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భావించే 67వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఢిల్లీలో జ‌రిగింది. సినీ రంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి...ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకున్న చిత్రాల‌కు అవార్డులు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా ప్ర‌ధానం చేసారు. కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు. `మ‌ణిక‌ర్ణిక` చిత్రానికి గాను ఆమెకు ఈ అవార్డు ద‌క్కింది. ఇక ఉత్త‌మ న‌టుడిగా ధ‌నుష్ అవార్డు అందుకున్నారు. ఆయ‌న న‌టించిన `అసుర‌న్` (నార‌ప్ప‌) చిత్రానికి గాను అవార్డు ద‌క్కింది. అలాగే మ‌నోజ్ బాజ్ పాయ్ (బోంస్లే) కు గాను అవార్డులు అందుకున్నారు.

ఇక జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `జెర్సీ` చిత్రానికి ద‌క్కింది. ఎడిటింగ్ విభాగంలోనూ `జెర్సీ` అవార్డు అందుకుంది. ఇక బెస్ట్ తెలుగు పాపుల‌ర్ ఫిల్మ్ గా `మ‌హ‌ర్షి` కి నేష‌న‌ల్ అవార్డు ద‌క్కింది. అలాగే మ‌రో రెండు విభాగాల్లో `మ‌హ‌ర్షి` జాతీయ అవార్డుల‌ను అందుకుంది. మొత్తంగా `జెర్సీ`కి రెండు..`మ‌హ‌ర్షి` మూడు జాతీయ అవార్డుల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మ‌రోసారి చాటి చెప్పాయి. జెర్సీ చిత్రం క్రికెట్ నేప‌థ్యంలో ఓ వాస్త‌వ క్రీడాకారుడి జీవిత క‌థ ఆధారంగా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించారు. క‌మ‌ర్శియ‌ల్ గా ఈ సినిమా భారీ వ‌సూళ్లు తేన‌ప్ప‌టికీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఆ సినిమాకు ప‌నిచేసిన టీమ్ కి మంచి పేరొచ్చింది. ఇక మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాప్ట్ వేర్ కంపెనీ సీఈవో గా ఎదిగిన మ‌హ‌ర్షి అటుపై రైతు ఆత్మ‌హ‌త్య‌లు.. క‌ష్టాలు తెలుసుకుని రైతు గా మార‌డం అన్న‌దే సినిమా కంటెంట్. న‌టుడిగా మ‌హేష్ కి మ‌రింత గుర్తింపునిచ్చింది. చ‌క్క‌ని సందేశాత్మ‌క చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే క్రికెట్ నేప‌థ్యంలో ఒక యువ‌కుడి ఎమోష‌న‌ల్ ల‌వ్ లైఫ్ జ‌ర్నీకి కెరీర్ జ‌ర్నీకి క‌నెక్ట్ చేస్తూ గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన జెర్సీ క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌తో పాటు ఎన్నో అవార్డుల్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జాతీయ అవార్డును అందుకున్న నాని- గౌత‌మ్ బృందం ఆనందోత్సాహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జెర్సీ చిత్రం హిందీ త‌మిళంలో రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News