`భరత్ అనే నేను` తో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ హిట్ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా భరత్ అనే నేను నిలిచింది. ఆ హిట్ రన్ ను కొనసాగించేందుకు మహేష్ తన 25వ సినిమా షూటింగ్ ను మొదలెట్టేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ - పూజా హెగ్డేల మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను డెహ్రాడూన్ లో చిత్రీకరించారు. జూన్ 17న మొదలైన డెహ్రాడూన్ షెడ్యూల్....శుక్రవారంతో ముగిసింది. ఈ రోజు రాత్రికి ప్రిన్స్ తో పాటు చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకోనుంది. అయితే, ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. కొంత గ్యాప్ తీసుకొని చిత్ర యూనిట్ అమెరికా వెళ్లబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రానికి 'రాజసం' .. 'రైతుబిడ్డ' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
మహేష్ 25 వ సినిమా తర్వాతి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో నటిస్తోన్న ప్రధాన పాత్రల మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించబోతున్నారట. దాంతోపాటు, మహేష్ - పూజా హెగ్డేల మధ్య 2 పాటలను కూడా అక్కడ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని కీలకమైన సన్నివేశాలు కర్నూలులో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో లైట్ గడ్డంతో ఉన్న మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలో మహేష్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడట. కాలేజ్ స్టూడెంట్ గా - రైతు సమస్యలపై పోరాడే యువకుడిగా ప్రిన్స్ అలరించబోతున్నాడట. దిల్రాజు - అశ్వనీదత్ - పీవీపీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.