'మీ లెగసీని ముందుకు తీసుకెళ్తా నాన్నా'.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..!

Update: 2022-11-24 10:36 GMT
లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన నటశేఖరుడు 79 ఏళ్ళ వయసులో నవంబర్ 15న తుది శ్వాస విడవడం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించగా.. యావత్ చిత్రసీమ ఆయనకు ఘన నివాళి అర్పించింది.

డేరింగ్ అండ్ డాషింగ్ గా పిలవబడే కృష్ణ మరణాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని వేదన మిగిల్చింది. తండ్రిని కోల్పోయిన బాధలో మహేష్ బాబు బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇప్పటికే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ మరియు పిల్లలు గౌతమ్ - సితార సోషల్ మీడియాలో కృష్ణతో ఉన్న అనుబంధం గురించి ఎమోషనల్ నోట్ షేర్ చేసారు.

తాజాగా మహేష్ బాబు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించారు. కృష్ణ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేస్తూ.. ఓ ఎమోషనల్ నోట్ ని పంచుకున్నారు. నేను మీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాను.. నేను నిన్ను ఇంకా గర్వపడేలా చేస్తాను.. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్ అని పేర్కొన్నారు.

"మీ జీవితం గొప్పగా సెలబ్రేషన్ గా సాగింది. ఇది మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ స్వభావం. నా స్ఫూర్తి, నా ధైర్యం.. నేను చూసుకున్నదంతా.. నిజంగా ముఖ్యమైనవన్నీ అలాగే వెళ్లి పోయాయి. కానీ, విచిత్రమేమిటంటే, నేను ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాననిపిస్తోంది. ఇప్పుడు, నేను నిర్భయంగా ఉన్నాను. మీ కాంతి నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. నేను మీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాను. నేను మిమ్మల్ని ఇంకా గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా. మై సూపర్ స్టార్" అని మహేష్ తన ప్రకటనతో భావోద్వేగానికి గురి చేసారు.

ఈ ఏడాదిలో ఘట్టమనేని కుటుంబంలో మూడు విషాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమనే చెప్పాలి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు జనవరిలో మరణించగా.. ఇటీవల ఆయన తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కృష్ణ కూడా తిరిగిరాని లోకాలను వెళ్లిపోయారు. ఇలా ఒకే ఏడాదిలో ఒకరి వెంట ఒకరు ముగ్గురు తన ప్రాణసమానులు దూరం కావడం మహేష్ మానసికంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇప్పుడు కుటుంబ పెద్దగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిన మహేష్ బాబు.. ఈ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి ఆశీస్సులతో ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లాడానికి సంకల్పించుకున్నాడు. మానసికంగా మరింత దృడంగా మారుతున్నట్లు పేర్కొంటున్నారు. దీనికి అభిమానులు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు ధైర్యం చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News