‘శ్రీమంతుడు’కీ ఆ కష్టాలు తప్పవా?

Update: 2015-07-31 07:56 GMT
ఇక్కడ మాట్లాడుతోంది శ్రీమంతుడి కష్టాల గురించి కాదు.. శ్రీమంతుడు సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానుల కష్టాల గురించి. బాహుబలి సినిమా మీద మరీ ఎక్కువ ఆసక్తి చూపిన పాపానికి జేబుకు భారీగా చిల్లు పడింది. దొరికినోడికి దొరికినంత అన్నట్లు ఎవ్వరూ వదిలి పెట్టలేదు. టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ దోపిడీ జరిగింది ఆ సినిమాతోనే. వంద రూపాయల టికెట్ కూడా ఐదొందలకు అమ్మే స్థాయిలో బ్లాక్ టికెట్ల దందా నడిచింది. ప్రభుత్వం ఈ దారుణాల్ని చూస్తూ ఉంది తప్పితే ఏమీ చేయలేకపోయింది. చాలా వరకు పోలీసులకు తెలిసే ఈ వ్యవహారమంతా నడిచింది. అన్నింటికంటే దారుణమైన విషయం.. మల్టీప్లెక్సుల్లో కూడా బ్లాక్ టికెట్ల దందా నడవడం.

రెగ్యులర్ షోల విషయంలో జరిగిన బ్లాక్ దందా ఒకెత్తయితే స్పెషల్ షోల పేరుతో జరిగిన దోపిడీ మరో ఎత్తు. అంతకుముందు కూడా స్టార్ హీరోలకు బెనిఫిట్ షోలు పడ్డాయి. కానీ టికెట్లు 500-1000 మధ్య ఉండేవి. కానీ బాహుబలికి మాత్రం మినిమం వెయ్యి రూపాయల టికెట్... మాగ్జిమం 2 వేల వరకు  పెట్టారు. డిమాండ్ ఉంది కాబట్టి అమ్మాం అంటారు జనాలు. ఏంటీ దారుణం అని అడిగేవాడు లేడు. ఐతే మరీ బాహుబలి స్థాయిలో కాకున్నా శ్రీమంతుడు మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానుల్లోనూ హైప్ అదే స్థాయిలో ఉంది. దీంతో మరోసారి థియేటర్ల దగ్గర భారీ దోపిడీకి సన్నాహాలు మొదలైపోయాయని తెలుస్తోంది. బెనిఫిట్ షోల పేరిట భారీగా దండుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఐతే మహేష్ మాత్రం ఇలాంటి వ్యవహారాల్ని ఇష్టపడడు. మిడ్ నైట్ షోలు వద్దే వద్దని కూడా అతనంటున్నాడని.. కావాలంటే కొంచెం తెల్లవారాక ఒక షో వేసుకోమని అంటున్నాడట. మరి జనాలు అతడి మాట వింటారా అన్నదే డౌటు.
Tags:    

Similar News