నంది అవార్డులపై ఆ నిర్మాత కూడా..

Update: 2017-11-17 05:53 GMT
నంది అవార్డుల విషయమై మరో నిర్మాత మీడియా ముందుకొచ్చాడు. ఇప్పటికే ‘రుద్రమదేవి’ దర్శక నిర్మాత గుణశేఖర్‌ తో పాటు ‘రేసుగుర్రం’ ప్రొడ్యూసర్స్ నల్లమలుపు శ్రీనివాస్.. వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి మరీ అవార్డుల కమిటీని తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్మాత మాల్కాపురం శివకుమార్ కూడా అవార్డు కమిటీ తీరును దుయ్యబట్టాడు. తన నిర్మాణంలో వచ్చిన ‘సూర్య వెర్సస్ సూర్య’ సినిమాకు నంది అవార్డుల్లో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. హాలీవుడ్ వాళ్లకు కూడా స్ఫూర్తిగా నిలిచే కాన్సెప్టుతో మంచి సినిమా తీస్తే.. అవార్డుల కమిటీకి అది కనిపించలేదని ఆయన విమర్శించాడు.

‘‘2015లో సరికొత్త కాన్సెప్టుతో నిఖిల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నేను నిర్మించిన సూర్య వర్సెస్ సూర్య వినూత్న చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇదే కాన్సెప్టుతో హాలీవుడ్లో భారీ బడ్జెట్లో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. హాలీవుడ్ వాళ్లకు స్ఫూర్తినిచ్చిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? అసలు ఈ అవార్డులు తెలుగుదేశం ప్రభుత్వం తరపున ఇచ్చిన అవార్డులా అనిపిస్తున్నాయి. ఈ మూడు సంవత్సరాల నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా కప్పింది. అవార్డులకు అర్హత వున్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా వున్న వారికే అవార్డులను పంచిపెట్టింది. ఇవి ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది’’ అని శివకుమార్ విమర్శించాడు.
Tags:    

Similar News