రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నేల టికెట్’. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ - ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన కల్యాణ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మోడల్ మాళవిక శర్మను ఎంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ‘నేలటికెట్’లో మెడికల్ కాలేజీ విద్యార్థిగా నటిస్తున్న మాళవిక - ఇంకా ఆ సినిమా విడుదల కాకముందే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ దక్కించుకుందని సమాచారం.
ప్రతీ సినిమాకీ వైవిధ్యాన్ని చూపిస్తున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందబోతున్న ఈ చిత్రం, త్వరలోనే లాంఛ్ చేసి, షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నారట చిత్ర యూనిట్. రామ్ ఎనర్జీకి తగినట్టుగా ఓ కొత్త ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావించారట. అలా వెతుకుతున్న వారికి నేలటికెట్ లో హీరోయిన్ నటిస్తున్న మాళవిక కనిపించిదట. రామ్ సినిమాలో పాత్రకు మాళవిక అయితే సరిగ్గా సరిపోతుందని భావించిన చిత్ర బృందం - వెంటనే ఆమెని ఓకే చేసిందట. మొదటి సినిమా విడుదల కాకముందే మరో మంచి ప్రాజెక్టు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది మాళవిక.
ప్రేక్షకులను కట్టిపడేసే స్ర్కీన్‌ప్లేతో మంచి యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రామ్ సినిమాను తెరకెక్కించనున్నాడట ప్రవీణ్ సత్తారు. ‘చందమామ కథలు’ - ‘గుంటూర్ టాకీస్’ - ‘పీఎస్ వీ గరుడవేగ’వంటి విభిన్న చిత్రాల తర్వాత ప్రవీణ్ ఎటువంటి సినిమా తీస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.