మూవీ రివ్యూ : మ‌న‌లో ఒక‌డు

Update: 2016-11-05 09:30 GMT
‘మ‌న‌లో ఒక‌డు’ రివ్యూ

న‌టీన‌టులుః ఆర్పీ ప‌ట్నాయ‌క్ - అనిత‌ - సాయికుమార్‌ - నాజ‌ర్ - త‌నికెళ్ల భ‌ర‌ణి - బెన‌ర్జీ - శ్రీ ముఖి - గిరి త‌దిత‌రులు
ఛాయాగ్రహణం: ఎస్‌.జె.సిద్ధార్థ్‌
సంభాషణలు: తిరుమల్ నాగ్‌
నిర్మాత: గురుజాల జగన్మోహన్‌
కథ - స్క్రీన్ ప్లే - సంగీతం - దర్శకత్వం: ఆర్‌.పి.పట్నాయక్‌

సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత న‌టుడిగా మారి.. ఆపై ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులేశాడు ఆర్పీ ప‌ట్నాయ‌క్. ద‌ర్శ‌కుడిగా కొన్ని మంచి ప్ర‌య‌త్నాలే చేసినా అత‌డికి ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త సినిమా ‘మ‌న‌లో ఒక‌డు’పై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు ఆర్పీ. ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆర్పీ ఆశ‌ల్ని నెర‌వేర్చేలా ఉందో లేదో చూద్దాం ప‌దండి.

క‌థః

కృష్ణ‌మూర్తి (ఆర్పీ ప‌ట్నాయ‌క్‌) ఒక క‌ళాశాల‌లో ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. అత‌డి భార్య శ్రావ‌ణి (అనిత‌) మ్యూజిక్ టీచ‌ర్. కృష్ణ‌మూర్తికి ఇంటి ద‌గ్గ‌ర‌.. కాలేజీలో చాలా మంచి పేరుంటుంది. ఐతే సాఫీగా సాగిపోతున్న అత‌డి జీవితం ఓ టీవీ ఛానెల్ చేసిన త‌ప్పు వ‌ల్ల మ‌లుపు తిరుగుతుంది. అత‌డి జీవితం ఒక్క‌సారిగా అల్ల‌క‌ల్లోలం అయిపోతుంది. ఇంత‌కీ ఆ ఛానెల్ చేసిన త‌ప్పేంటి..? త‌న ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఆ ఛానెల్ పై కృష్ణ‌మూర్తి ఎలా పోరాడి.. త‌న‌పై ప‌డ్డ ముద్ర‌ను ఎలా చెరిపేసుకున్నాడు అన్న‌ది మిగ‌తా క‌థ‌.

క‌థ‌నం - విశ్లేష‌ణః

ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన‌.. సామాజిక అంశాల‌తో ముడిప‌డిన స‌మ‌కాలీన క‌థ‌ల్నే ఎంచుకుంటున్నాడు ఆర్పీ ప‌ట్నాయ‌క్. ‘మ‌న‌లో ఒక‌డు’ కూడా కాంటెంప‌ర‌రీ స‌బ్జెక్టే. అంద‌రూ రిలేట‌య్యే క‌థాంశమే. ప్ర‌స్తుతం మీడియా విప‌రీత పోక‌డ‌లు ఎలా ఉన్నాయో.. టీఆర్పీ రేటింగుల మాయ‌లో ప‌డి ఛానెళ్లు చేసే హ‌డావుడి.. తొంద‌ర‌పాటు వార్త‌ల వ‌ల్ల సామాన్యులు ఎలా ఇబ్బంది ప‌డుతున్నారో మ‌న‌లో ఒక‌డులో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ఆర్పీ. కాక‌పోతే ఇందులో క‌థ ఒక చిన్న పాయింట్ మీద న‌డుస్తుంది. సినిమాలో ఒక ఉప‌క‌థ‌గా ఉండాల్సిన ఎపిసోడ్ ను ఒక సినిమాగా సాగ‌దీయ‌డం ’మ‌న‌లో ఒక‌డు’కు మైన‌స్ అయింది.

క‌థాంశం మంచిదే అయినా.. దాన్ని ఆస‌క్తిక‌రంగా.. సంక్షిప్తంగా చెప్ప‌లేక‌పోవ‌డంతో ‘మ‌న‌లో ఒక‌డు’ ప్ర‌త్యేక‌మైన సినిమాగా నిల‌వ‌లేక‌పోయింది. మీడియా చేస్తున్న త‌ప్పుల్ని ఎత్తి చూపుతూ.. వాళ్ల బాధ్య‌త‌ల్ని గుర్తు చేయాలన్న ప్ర‌య‌త్నంలో ఆర్పీ అన‌వ‌స‌ర విష‌యాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు. టీవీ ఛానెళ్ల‌లో ఎలాంటి త‌ప్పులు జ‌రుగుతాయో ఒక్కొక్క‌టిగా ఎత్తి చూప‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. మ‌రోవైపు ఇందులో క‌థానాయ‌కుడికి ఎదుర‌య్యే స‌మ‌స్యను.. దాని వ‌ల్ల అత‌ను ప‌డే ఇబ్బందుల్ని.. అంతిమ ప‌రిష్కారాన్ని వేగంగా చెప్ప‌లేక‌పోయాడు. ఆరంభంలో హీరోను మంచివాడిగా చూపించ‌డం కోసమే చాలా సన్నివేశాలు తీసుకున్న ఆర్పీ.. ఆ త‌ర్వాత అత‌డికి స‌మ‌స్య ఎదురయ్యాక క‌థ‌నాన్ని మ‌రీ నెమ్మ‌దిగా న‌డిపించాడు.

ఇంట‌ర్వెల్ నుంచి అయినా హీరో మీడియాపై పోరాటం మొద‌లుపెట్టి త‌న స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకుంటాడేమో అని చూస్తే.. అలా జ‌ర‌గ‌దు. ద్వితీయార్ధంలోనూ ఓ గంట పాటు హీరో ఇబ్బందుల చుట్టే క‌థ‌ను న‌డిపించాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో మీడియా విప‌రీత పోక‌డ‌ల మీద‌ వృథా స‌న్నివేశాలు క‌థ‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తాయి. హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారిపోయి.. నిస్స‌హాయంగా మారిపోవ‌డంతో ప్రేక్ష‌కుడిలోనూ నీర‌సం వ‌చ్చేస్తుంది. ఐతే సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అన‌ద‌గ్గ  ప్రి క్లైమాక్స్ తో మ‌ళ్లీ క‌థ‌నం ప‌ట్టాలెక్కుతుంది. సాయికుమార్‌.. నాజ‌ర్ లీడ్ తీసుకుని మ‌ళ్లీ ప్రేక్ష‌కుల్ని సినిమాలోకి లాక్కొస్తారు.

టీవీ ఛానెల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో సాయికుమార్-నాజ‌ర్ మ‌ధ్య జ‌రిగే వాదోప‌వాదాలు.. అందులో వ‌చ్చే ప‌దునైన సంభాష‌ణ‌లు ఆ స‌న్నివేశాన్ని ర‌క్తి క‌ట్టించాయి. క్లైమాక్స్ ట్విస్టు కూడా బాగుంది. ఇక్క‌డే సినిమాలో జీవం క‌నిపిస్తుంది. కానీ మ‌ళ్లీ ఆర్పీ తెర‌మీదికి వ‌చ్చి మీడియాకు పాఠాలు చెప్పే ప‌నిలో ప‌డ‌టంతో గ్రాఫ్ మ‌ళ్లీ కొంచెం ప‌డిపోతుంది. ఆ స‌న్నివేశంలో కొన్ని డైలాగులు బాగానే ఉన్నా.. ప్రీచింగ్ ఎక్కువైపోయింది. ఓవ‌రాల్ గా మ‌న‌లో ఒక‌డు అంద‌రూ క‌నెక్ట‌య్యే క‌థ‌తో చేసిన మంచి ప్ర‌య‌త్న‌మే.. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి..  కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో.. ఆస‌క్తిక‌రంగా ఈ క‌థ‌ను చెప్ప‌క‌పోవ‌డం మైన‌స్.

న‌టీన‌టులుః

న‌టుడిగా ఆర్పీ ప‌ట్నాయ‌క్ అంత ఇంపాక్ట్ చూపించ‌లేదు. అత‌డి ముఖంలో హావ‌భావాలు ప‌ల‌క‌లేదు. బాడీ లాంగ్వేజ్ కూడా అంతంత‌మాత్ర‌మే. బిగుసుకుపోయిన‌ట్లు క‌నిపించాడు. సీరియ‌స్ గా సాగే కొన్ని స‌న్నివేశాల్లో ప‌ర్వాలేదు కానీ.. సినిమాను లీడ్ చేసే పాత్ర‌లో అత‌ను అంత ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. సాయికుమార్.. నాజ‌ర్ త‌మ పాత్ర‌ల్ని బాగా పండించారు. వాళ్లిద్ద‌రే సినిమాకు ప్ర‌ధాన బ‌లం. హీరోయిన్ అనిత ప‌ర్వాలేదు. బెన‌ర్జీ.. భ‌ర‌ణిల న‌ట‌న హుందాగా సాగింది. మిగ‌తా వాళ్లంతా ఓకే.

సాంకేతిక‌వ‌ర్గంః

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ ప‌ర్వాలేదు. జేసుదాసు పాడిన పాట‌తో పాటు ఆరంభంలో వ‌చ్చే మ‌ధుర‌మే మ‌ధుర‌మే ఆక‌ట్టుకుంటాయి. నేప‌థ్య సంగీతం అంత ఎఫెక్టివ్ గా లేదు. టెంప్లేట్ ఆర్.ఆర్.వాడేసిన‌ట్లు అనిపిస్తుంది. సిద్ధార్థ్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. తిరుమ‌ల్ నాగ్ అక్క‌డ‌క్క‌డా బాగానే పేలాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నంత‌లో బాగానే ఉన్నాయి. ఇక రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఆర్పీ ప‌ట్నాయ‌క్.. ఎంచుకున్న క‌థాంశం మంచిదే. కానీ ఈ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయాడు. ప్రిక్లైమాక్స్ లో.. మ‌రికొన్ని స‌న్నివేశాల్లో ఆర్పీ సినిమాను నిల‌బెట్టినా.. చాలాచోట్ల ఆస‌క్తిని నిలిపి ఉంచ‌లేక‌పోయాడు. స్క్రీన్ ప్లేలో మ‌రింత పేస్ ఉండేలా చూసుకోవాల్సింది. ఐతే ద‌ర్శ‌కుడిగా ఆర్పీ చేసిన ప్ర‌య‌త్నాల్లో ఇది ముందు వ‌రుస‌లో నిలుస్తుంది.

చివ‌ర‌గాః మ‌న‌లో ఒక‌డు.. చిన్న క‌థ‌.. పెద్ద సినిమా

రేటింగ్ః 2.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News