9:45 AM మంచు మ‌నోజ్ శుభ‌వార్త ఏం చెబుతాడో?

Update: 2023-01-19 14:48 GMT
మంచు మ‌నోజ్ ఒక దివ్య‌మైన‌ ముహూర్తం ఫిక్స్ చేసాడు. రేపు 9:45 AM కి అభిమానుల‌కు శుభ‌వార్త‌ను షేర్ చేయడానికి వేచి ఉండలేన‌ని చెప్పాడు. ఒక సంబ‌రం లాంటి వార్త అంటూ ఊరించాడు. అంతేకాదు.. మీరే గెస్ చేయండి అన్న‌ట్టుగా.. ''ఇది చాలా కాలంగా ఉంది.. నేను ఈ ప్రత్యేక వార్తను నా హృదయానికి దగ్గరగా ఉంచాను'' అంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసాడు. నా జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను అని ప్ర‌క‌టించాడు. 20 జనవరి 2023న ప్రకటన వ‌స్తోంది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి! అంటూ రామ బాణం లాంటి ట్వీట్ సంధించాడు.

దీనికి ట్విట్ట‌ర్ లో ప్ర‌తి స్పంద‌న‌లు అంతే ధీటుగా ఘాటుగా ఉన్నాయి. ఇంత‌కీ మంచు బుల్లోడు ఏం చెప్ప‌బోతున్నాడు? అన్న సందేహం చాలా మందిలో ఉంది.  అప్పుడే ఒక అభిమాని మ‌నోజ్ అన్న పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ఊహించేశాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసాడు. పెళ్లి గురించే గా అన్నా.. ఎనీవే కంగ్రాట్స్! అని ఒక అభిమాని వ్యాఖ్య‌ను జోడించాడు. సాంగ్ లిరిక్స్ తో మీరు చెప్పే న్యూస్ కి ఏమైన లింక్ ఉందా బ్రో? అంటూ మ‌రో అభిమాని డౌట్ వ్య‌క్తం చేశాడు. వెయిటింగ్ బ్ర‌ద‌ర్.. నేను మీకు తెలుసా చూడాలి.. అని ఒక అభిమాని ఆనందం వ్య‌క్తం చేశాడు. ఫైన‌ల్లీ ది న్యూస్ ఈజ్ క‌మింగ్...! అని 'వియ్ ఆర్ ఆల్ వెయిటింగ్ అన్నా.. రెబ‌లిఫైడ్ డార్లింగ్! అని మ‌రో అభిమాని వ్యాఖ్యానించ‌గా.. కంబ్యాక్ కోసం వెయిటింగ్ అని .. ముందు మీ సినిమా కావాలి అని మ‌రో అభిమాని ఎగ్జ‌యిట్ అయ్యారు. ''మా అన్న‌య్య కొత్త సినిమా ప్రారంభించ‌బోతున్నాడు. మూవీ అయితే హ్యాపీ అన్నా.. పెళ్ల‌యితే డ‌బుల్ హ్యాపీ..'' అని ప్ర‌తి ట్వీట్ చేశాడు మ‌రో అభిమాని. అన్నా మ్యారేజ్ అంటావు ఏంట‌న్నా? అంటూ ఒక అభిమాని విచారం  కూడా వ్య‌క్తం చేస్తూ ఈమోజీని షేర్ చేసాడు.

అస‌లిదంతా పెళ్లి గురించేనా ..?

అవును.. అస‌లిదంతా పెళ్లి గురించేనా ..? ఈ హంగామా దేనికోసం? అనే సందేహాలు మీలో ఉంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాలి. యువ‌హీరో మంచు మనోజ్ వ్యక్తిగత కారణాలతో ఇటీవ‌ల వార్తల్లో నిలుస్తున్నాడు. అత‌డు కొంత‌కాలంగా నటన‌ను విర‌మించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే వ్య‌క్తిగ‌త జీవితాన్ని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ కుటుంబానికి చెందిన యంగ్ డైన‌మైట్ భూమా మౌనిక రెడ్డిని ఆయన వివాహం చేసుకోనున్నారని క‌థ‌నాలొచ్చాయి. అప్ప‌ట్లో హైదరాబాద్ లోని గణేష్ విగ్రహం వద్ద మనోజ్- మౌనిక ప్రార్థనలు చేస్తున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. మంచు మనోజ్ తన కాబోయే భార్య భూమ మౌనికతో కలిసి హైదరాబాద్‌ గణేష్ పండల్ వద్ద కనిపించాడని మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయి. హైదరాబాద్ లోని గణేష్‌కు హారతి ఇచ్చేందుకు కాబోయే భర్తతో కలిసి మౌనిక‌ బయటకు వచ్చారని కూడా ప్ర‌చార‌మైంది. మనోజ్ త్వరలో మౌనికను పెళ్లి చేసుకోబోతున్నాడని మీడియాతో దీనిపై ఓపెన్ అయ్యాడని క‌థ‌నాలొచ్చాయి.

నిజానికి మ‌నోజ్ పెళ్లిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఇవ‌న్నీ ఊహాగానాలు మాత్ర‌మే. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మౌనికతో రెండో పెళ్లి గురించి మనోజ్ ని మీడియా అడిగినప్పుడు మనోజ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని సరైన టైమ్ చూసి అధికారిక ప్రకటన చేస్తానని అప్ప‌ట్లో పరోక్షంగా త‌న రెండో పెళ్లి గురించి సందిగ్ధ‌త‌ను అలానే కొన‌సాగించాడు. భవిష్యత్ సినిమాలు తన రాజకీయ ప్రవేశంపై ప్ర‌శ్నించ‌గా..వాటిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. వినాయకుడి గురించి మాట్లాడాల్సిన చోట ఈ ప్ర‌శ్న‌లు వ‌ద్ద‌ని వారించాడు.

మంచు మనోజ్ 2015 లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. విభేధాల కార‌ణంగా 2019 సంవత్సరంలో విడిపోవాలని నిర్ణయించుకుంది ఈ జంట‌. అదే క్ర‌మంలో మ‌నోజ్ తన విడాకుల గురించి అధికారిక ప్రకటనను విడుదల చేశాడు.

విడాకుల తర్వాత మంచు మనోజ్ దాదాపు 3 సంవత్సరాలుగా పెద్ద స్క్రీన్ కు దూరంగా ఉండి అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా చిత్రంతో తన పునరాగమనాన్ని ప్రకటించాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

మనోజ్ ఎప్పుడూ పాజిటివ్ ఇమేజ్ ని క‌లిగి ఉన్న హీరో. కొన్ని సంవత్సరాల క్రితం దాడి- గుంటూరోడు లాంటి చిత్రాల్లో న‌టించిన అత‌డు.. అప్ప‌ట్లోనే 'ఐక్యత' అనే ఫౌండేషన్ ను రైతుల సంక్షేమం కోసం నిధులు సేకరించడానికి ప్రారంభించాడు. సామాజిక చైతన్యమే తన కప్‌ ఆఫ్‌ టీ అని కొన్నేళ్ల క్రితమే వెల్ల‌డించాడు. అలాగే మనోజ్ రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. అతని సోషల్ మీడియా పోస్ట్ లు సానుకూలంగా ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News